HomeతెలంగాణMURDER: వీడిన జంట హత్యల మిస్టరీ.. పూజారితో పాటు కుమారుడు హతం

MURDER: వీడిన జంట హత్యల మిస్టరీ.. పూజారితో పాటు కుమారుడు హతం

MURDER: తుకారం గేట్‌కు చెందిన పర్మ యోగేందర్ రెడ్డి 1991లో రాజకీయ విబేధాల కారణంగా దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో యోగేందర్ రెడ్డి భార్య, తన పిల్లలను తీసుకొని ఉప్పల్‌లోని పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో ఉప్పల్‌లో నివాసముంటున్న పూజారి నర్సిమ్ల నర్సింహ(75).. యోగేందర్ రెడ్డి కుమారుడు లిక్కి వినయ్‌(31) పరిచయం అయ్యాడు. ఇక లిక్కి వినయ్‌ మేనమామ జంగారెడ్డి కూడా పూజారి ఇంటికి వెళ్లేవాడు. ఆ పూజారి వద్ద జంగారెడ్డి పలు పూజలు చేయించుకునేవాడు.

ఎస్ఐ ఉద్యోగం రావాలని లిక్కి పూజలు
లిక్కి వినయ్‌ 2016లో ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నర్సింహ వద్ద పూజలు చేయించాడు. అందుకు రూ. 6 లక్షలు వసూలు చేశాడు పూజారి. మరో వ్యక్తికి కూడా లిక్కి రూ. 12 లక్షల 50 వేలు చెల్లించాడు. వీరు పూజలు చేసినప్పటికీ లిక్కి వినయ్‌కు ఎస్‌ఐ ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత తన డబ్బులు తనకు తిరిగివ్వాలని లిక్కి వారి మీద ఒత్తిడి తెచ్చాడు. ఆ వ్యక్తి తిరిగి రూ. 12 లక్షల 50 వేలను లిక్కికి ఇచ్చేశాడు. పూజారి నర్సింహ మాత్రం రూ. 6 లక్షలు తిరిగివ్వలేదు.

మరోసారి పూజారి వద్ద పూజలు
2019లో లిక్కి వినయ్ మరోసారి పూజారి నర్సింహను సంప్రదించాడు. తాను జీవితంలో సెటిల్ కాలేకపోతున్నానని పూజారికి చెప్పాడు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాను. అందుకు పూజ చేయాలని నర్సింహను కోరాడు. అందుకు రూ. 11 వేలు వసూలు చేశాడు పూజారి. ఆ తర్వాత లిక్కి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. లాక్‌డౌన్‌ విధించడంతో లిక్కి ఆస్ట్రేలియా నుంచి 2020, సెప్టెంబర్‌లో తిరిగొచ్చాడు.

మళ్లీ రూ. 6 లక్షలు ఇవ్వాలని పూజారిపై ఒత్తిడి
2021, మార్చిలో పూజారి నర్సింహ వద్దకు లిక్కి వినయ్ వచ్చి రూ. 6 లక్షలు ఇవ్వమని ఒత్తిడి తెచ్చాడు. పూజారి లిక్కి మాటలను పట్టించుకోలేదు. సెప్టెంబర్ వరకు ఇద్దరి మధ్య స్వల్ప ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. కొద్ది రోజులకే లిక్కి వినయ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆర్థికంగా కుంగిపోయాడు. మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఓ పోలీసు కేసు కూడా నమోదైంది. ప్రతి పౌర్ణమి రోజు తాను తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు గుర్తించాడు. కచ్చితంగా పూజారి నర్సింహ తనకు చేతబడి చేసి ఉంటాడని లిక్కి అనుమానం పెంచుకున్నాడు. దీంతో నర్సింహను ఎలాగైనా హత్య చేయాలని లిక్కి నిర్ణయించుకున్నాడు.

హాస్టల్‌లో ఉండి రెక్కీ నిర్వహించి హత్య
ఇక లిక్కి వినయ్‌ మొదటగా తన ఫ్రెండ్‌ బాలకృష్ణను సంప్రదించి ఈ విషయాన్నంతా చెప్పాడు. లిక్కితో పాటు మరో నలుగురు కలిసి నర్సింహ హత్యకు ప్లాన్ చేశారు. నర్సింహ ఇంటి ముందున్న బాయ్స్ హాస్టల్‌లో లిక్కి గ్యాంగ్ దిగింది. రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించి, నర్సింహ కదలికలపై నిఘా ఉంచారు. ఈ నెల 14న ఉదయం 6 గంటలకు గేటు వద్ద నర్సింహను దొరికించుకొని విచక్షణారహితంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. ఇంట్లో ఉన్న నర్సింహ కుమారుడు శ్రీనివాస్‌ను కూడా మట్టుబెట్టారు. ఏ1 లిక్కి వినయ్‌, ఏ2 యెల్లా బాలకృష్ణను 17వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో సుచిత్ర సర్కిల్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏ3, ఏ4, ఏ5 లను 18వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యలకు వాడిన కత్తులను, కొడవళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img