HomeతెలంగాణMynampally is far from Pantham itself పంతంతోనే మైనంపల్లి దూరం

Mynampally is far from Pantham itself పంతంతోనే మైనంపల్లి దూరం

  • కేటీఆర్, హన్మంతరావు ఎవ్వరూ తగ్గలేదు
  • బీఆర్ఎస్ పార్టీకి రెండు నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితి
  • మైనంపల్లిని మర్రి రాజశేఖర్ రెడ్డి ఢీకొట్టగలరా?
  • రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ

ఇదేనిజం, హైదరాబాద్: మైనంపల్లి హన్మంతరావు మాస్ లీడర్. మల్కాజిగిరి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. ఇక సొంత సెగ్మెంట్ మెదక్ లో సైతం ఆయనకు తిరుగులేదు. అయితే ప్రస్తుతం మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మైనంపల్లి వెళ్లిపోవడం కచ్చితంగా బీఆర్ఎస్ కు నష్టమే నన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే మల్కాజిగిరిలో మైనంపల్లిని ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలో ఉన్నా.. మైనంపల్లి తనకు ఉన్న వ్యక్తిగత బలం, క్యాడర్, ఆర్థిక, అంగబలంలో దూసుకుపోగలరు. మైనంపల్లి హన్మంత్ రావు.. కేటీఆర్ ఇద్దరూ పంతాలకు పోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. మైనంపల్లి తన కుమారుడికి టికెట్ దక్కలేదని తెలిసి తిరుమలలో నోరు పారేసుకున్నారు. ఈ విషయం అధిష్ఠానానికి కోపం తెప్పించింది. ఆ తర్వాత మైనంపల్లి కొంచెం తగ్గారు. కానీ బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అతడికి నియోజకవర్గంలో నిధులు కట్ చేయించింది. సహాయనిరాకరణ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఎమ్మెల్సీ కవిత జోక్యం చేసుకొని మైనంపల్లిని బుజ్జగించారు. కేటీఆర్ తనను పిలిచి మాట్లాడితే పార్టీలో కొనసాగాలని మైనంపల్లి భావించినట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ సైతం అదే స్థాయిలో బెట్టు చేశారు. మైనంపల్లే తప్పు చేశారు కాబట్టి.. ఆయనే తన వద్దకు రావాలని భావించారు. వెరసి ఈ వివాదం చిక్కుముడిగా మారింది.

రెండు టికెట్లు సాధించుకున్న మైనంపల్లి..
మొత్తానికి మైనంపల్లి తన పంతం నెగ్గించుకున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రెండు టికెట్లు కన్ ఫార్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు ఎదురీత తప్పేలా లేదు. మల్కాజిగిరిలో మైనంపల్లిని నిలువరించడం.. మెదక్ లో రోహిత్ ను ఓడించడం బీఆర్ఎస్ కు కత్తిమీద సామే. మరి ఈ పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోవాలో వేచి చూడాలి.

మర్రి రాజశేఖర్ రెడ్డి మైనంపల్లిని ఎదుర్కోగలరా?
మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరిలో బలమైన నేత. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగితే .. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయనను ఢీకొట్టగలరా? అన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండటం.. కార్యకర్తలతో సత్సంబంధాలు ఉండటం మైనంపల్లికి కలిసొచ్చే అంశం. అయితే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆర్థికంగా బలమైన నేత. కానీ మాస్ లీడర్ కాదు. గత పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఆయన గెలుపు భారమంతా మంత్రి మల్లారెడ్డి మీదే ఉంది. మరోవైపు మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలో మేడ్చల్ లో గెలుపు నల్లేరు మీద నడక కాదు. ఈ పరిస్థితుల్లో మామా, అల్లుల్లు ఇద్దరు గెలుస్తారా? అన్నది వేచి చూడాలి. మరి మైనంపల్లి మల్కాజిగిరిలో.. ఆయన కుమారుడు రోహిత్ మెదక్ లో గెలుస్తారా? లేక అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img