– డిపాజిట్లు దక్కించుకొనే కమిటీ వేసుకోండి
– తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం
– బీజేపీని బీఎల్ సంతోష్ భ్రష్టు పట్టించారు
– మంత్రి హరీశ్ రావు
ఇదేనిజం, హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తనపల్లిలో మాట్లాడుతూ.. ‘నడ్డా.. తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డా.’ అంటూ వ్యాఖ్యానించారు. నడ్డా సొంతరాష్ట్రంలోనే బీజేపీని గెలిపించుకోలేకపోయారని .. ఆయన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బీజేపీ డిపాజిట్లు దక్కించుకొనేందుకు కమిటీలు వేసుకోవాలని సూచించారు. అప్పుడైనా పరువైనా దక్కుతుందని చురకలంటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ‘నడ్డా.. తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డా. తెలంగాణలో హంగ్ కాదు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది. కర్ణాటకలో భాజపాను బీఎల్ సంతోష్ భ్రష్టు పట్టించారు. తెలంగాణలోనూ ఆయన వల్ల భాజపా పతనం ఖాయం’ అని మంత్రి విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నందున మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటికే మండలానికి వైద్య కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పారు. మరోసారి విజయం సాధిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేసే అవకాశం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.