ఇదేనిజం, బాన్సువాడ: గృహ హింస, వరకట్నం కేసులు అంటూ మహిళలు పురుషులపై కేసులు పెడుతుండగా, కామారెడ్డి జిల్లాలో అందుకు భిన్నమైన ఘటన జరిగింది. తన భార్య రోజూ కొట్టుతోందని ఓ భర్త బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. అదికూడా వినూత్న రీతిలో ఆ భర్త కేవలం చెడ్డీ ధరించి అర్థ నగ్నంగా పోలీసుల వద్దకు వెళ్లాడు. భార్య నుంచి తనను కాపాడాలని, ప్రతిరోజూ కొడుతుందంటూ తన బాధలను చెప్పుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని రాజారాందుబ్బ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అర్ధనగ్నంగా రావడంతో పోలీసులు కంగుతిన్నారు. తన భార్య తరచూ తనను కొడుతుందని, ఆమెపై కేసు నమోదు చేయాలని సదరు వ్యక్తి పోలీసులను వేడుకున్నాడు. అయితే ఆ వ్యక్తి మద్యం సేవించి వచ్చాడని పోలీసులు గుర్తించారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు సీఐ కృష్ణ తెలిపారు.