ఢిల్లీలో వాయుకాలుష్యం మరింత విషమంగా మారింది. గురువారం ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు దిగజారుతోంది.దీన్ని బట్టి ఢిల్లీలో గాలి నాణ్యత ప్రాణాంతక స్థాయికి చేరుకుందని అర్థం చేసుకోవచ్చు. తాజగా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాలుష్య అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. ఢిల్లీ నగరం ఖాళీ కానుంది. అక్కడ జనం ఉండలేని పరిస్థితి నెలకొంది. చెన్నై నగరం గురించి తలచుకుంటే వర్షం కురిస్తే చాలు, ట్రాఫిక్‌తో నిండిపోయిందని బెంగళూరు పరిస్థితి. ఇక కోల్‌కతా గురించి మాట్లాడలేను. భవిష్యత్ తరాలకు మిగిలి ఉన్న ఏకైక నగరంగా హైదరాబాద్‌ను కాపాడుకోవాలనే సదుద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు డీజిల్/పెట్రోల్ వాహనాలన్నింటినీ తరలించి కాలుష్య రహిత వాహనాలను ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీనే దేశ రాజధానిగా కొనసాగించాలా? కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ రాజధానిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
దక్షిణాదిలో రెండో రాజధాని ఉండాలనే ప్రస్తావన చాలా దశాబ్దాలుగా వస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఈ ప్రతిపాదనను రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ తన ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు’ అనే పుస్తకంలో 11వ అధ్యాయంలో హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలని ప్రతిపాదించారు. అయితే మరి భవిష్యత్తులో హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేస్తారో లేదా అని కాలమే నిర్ణయిస్తుంది.