Homeతెలంగాణ#Huzurabad : పరిశీలనలో ఆ నలుగురు... టికెట్ ఎవరికి దక్కేనో...

#Huzurabad : పరిశీలనలో ఆ నలుగురు… టికెట్ ఎవరికి దక్కేనో…

హుజురాబాద్ ఉపఎన్నిక గ్రౌండ్‌లో ఇప్పటికైతే ఈటల మినహా మరో అభ్యర్థి కనిపించట్లేదు.

అభ్యర్థి కోసం అధికార పార్టీ సాగిస్తున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తున్నప్పటికీ.. ఇప్పటికైతే అధికారిక ప్రకటన లేదు.

అటు కాంగ్రెస్ పూర్తి స్తబ్దతలోకి వెళ్లిపోయింది.

దూకుడుగా వ్యవహరించే టీపీసీసీ చీఫ్ రేవంత్ హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో మాత్రం ఎందుకనో స్తబ్దుగా ఉంటున్నారు.

గతంలో హుజురాబాద్‌లో 60వేల పైచిలుకు ఓటు బ్యాంకు దక్కించుకున్న కాంగ్రెస్‌ ఈసారి ఏ మేరకు సత్తా చాటగలదనే చర్చ జరుగుతోంది.

ఆ పార్టీ తరుపున ఎవరిని అభ్యర్థిగా దింపుతారనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఈ క్రమంలో పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ టికెట్ ఎవరికి…? కాంగ్రెస్ తరుపున హుజురాబాద్‌లో కొండా సురేఖను పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను దామోదర రాజనర్సింహకు అప్పగించిన నేపథ్యంలో… ఇటీవల జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

కొండా సురేఖతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ దళిత సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలనుకుంటే… వరంగల్‌కు చెందిన సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య,కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణలకు అవకాశం ఇవ్వొచ్చుననే ప్రచారం జరుగుతోంది.

కొండా సురేఖనే దింపుతారా…? కొండా సురేఖ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

అంతకుముందు,2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సురేఖకు టికెట్ ఇవ్వలేదు.

సురేఖ కుటుంబంలో ఇద్దరికి టికెట్లు అడుగుతున్నారనే కారణంతో టీఆర్ఎస్ టికెట్ నిరాకరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే సురేఖ దంపతులు ఆ ఆరోపణలను ఖండించారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగి సొంత గూటికి చేరారు.

సురేఖ బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిగా కాంగ్రెస్ ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్…?

టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 16న హుజురాబాద్‌ పర్యటనలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

పాడి కౌశిక్ రెడ్డి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి, ముద్దసాని మాలతి, వకుళాభరణం కృష్ణ మోహన్, స్వర్గం రవి, పొనగంటి మల్లయ్య పేర్లను పరిశీలించిన కేసీఆర్… చివరకు గెల్లు శ్రీనివాస్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. ఆ నియోజకవర్గానికే చెందిన బండ శ్రీనివాస్‌ను ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నియమించారు.

అదే నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డికి ఇటీవలే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

ఇక హుజురాబాద్‌లోనే దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు.

హుజురాబాద్‌లో అసలైన పోటీ కేసీఆర్ వర్సెస్ ఈటలనే అన్న ప్రచారంతో గులాబీ బాస్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనప్పటికీ… చివరి నిమిషంలో ఈటల జమునా రెడ్డిని అభ్యర్థిగా దింపినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img