– యూపీలోని సాహియాబాద్ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ
– స్కూల్ స్టూడెంట్లు, సిబ్బందితో కలిసి ర్యాపిడ్ ఎక్స్ రైలులో ప్రయాణించిన ప్రధాని
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘నమో భారత్’ పట్టాలపై పరుగులుపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ స్టేషన్‌లో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్ ఎక్స్ రైలుకు ప్రధాని జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి తదితరులు పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ అందులో ప్రయాణించారు. స్కూల్ స్టూడెంట్లు, ర్యాపిడ్‌ఎక్స్ రైలు సిబ్బందితో ముచ్చటించారు. గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు ఉంటాయి. ఢిల్లీ- ఘజియాబాద్- మీరట్ మధ్య రూ.30 వేల కోట్లతో చేపట్టిన రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లో సాహిబాబాద్-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి.
నమోభారత్ రైళ్లలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉంటాయి. ప్రతి రైలులో 2 ప్లస్ 2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, లాప్‌టాప్,మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే కంట్రోల్ అయ్యే లైటింగ్ సిస్టమ్ ఉంటాయి. ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందిస్తాయి. ప్రతి 15 నిమిషాలకోకటి చొప్పున నడుస్తాయి.