ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోసం నందినగర్ లోని ఆయన ఇల్లు ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లిలోని తన నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ప్రమాదవశాత్తు ఆయన గాయపడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత గనక.. బీఆర్ఎస్ లీడర్లందరినీ కలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో లీడర్లలందరికీ అందుబాటులో ఉండే విధంగా నందినగర్ లోని తన నివాసాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆ ఇంటిని ముస్తాబు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ ఇంటికి రంగులు వేస్తున్నారు. ఇక ఇంటి వద్ద భారీగా పోలీసులు సైతం మోహరించారు. కేసీఆర్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే నందినగర్ ఇంటికే రాబోతున్నారు. తాజాగా ఈ ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంటివద్ద పరిస్థితిని తెలుసుకొనేందుకు ‘ఇదేనిజం’ ప్రతినిధి అక్కడికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. మొత్తానికి కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటికి రాబోతున్నారు. ఇక ఈ ప్రాంతమంతా బీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బిజీ బిజీగా మారనున్నది. చాలా కాలం తర్వాత కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటికి వెళ్తుండటం గమనార్హం.