Homeసినిమా#Narappa : భూమి , డబ్బు లాగేసుకుంటారు.. చదువును మాత్రం ఎవ్వరూ లాక్కోలేరు సిన్నబ్బా

#Narappa : భూమి , డబ్బు లాగేసుకుంటారు.. చదువును మాత్రం ఎవ్వరూ లాక్కోలేరు సిన్నబ్బా

నారప్ప.. 2019లో నేషనల్ అవార్డు సాధించిన తమిళ చిత్రం ‘అసురన్’‌కు రీమేక్.

ఆ చిత్రానికి పూమణి రాసిన “వెక్కాయ్” నవల ఆధారం. ఫ్యూడలిజం, పేదలపై ధనిక వర్గం అణచివేతలపై వచ్చిన మరో సినిమాలా కనిపించినప్పటికీ ఈ రీమేక్ తెలుగువారికి కారంచేడు ఘటనను మరోసారి గుర్తుచేస్తుంది.

నారప్ప(వెంకటేశ్), సుందరమ్మ( ప్రియమణి) వారి ముగ్గురు పిల్లలతో కలిసి అనంతపురం జిల్లాలోని ఓ ఊర్లో బతుకుతుంటారు.

సుందరమ్మ, తన అన్న బసవయ్య( రాజీవ్ కనకాల)కు కలిపి మూడెకరాల పొలం ఉంటుంది. ఊర్లో ధనికుడైన పండుస్వామికి ఆ పొలం మీదే కన్ను. అట్లా నారప్ప, పండుస్వామి కుటుంబాల మధ్య చిచ్చు రేగుతుంది.

సుందరమ్మ పాత్ర స్వతహాగా ధైర్యం గలది. అట్లాగే పెద్ద కొడుకు మునికన్న పాత్ర కూడా.

ఎవరైనా అవమానపరిస్తే అప్పటికప్పుడు చెప్పుతో కొట్టి తేల్చిపారేసుకోవాలనే స్వభావం మునికన్నది. హింస పరిష్కారం కాదంటూ ఓపికతో కొడుకు ప్రాణాల కోసం, కుంటుంబాన్ని రక్షించుకోవటం కోసం ఊరందరి కాళ్ళ మీద సాష్టాంగ పడతాడు నారప్ప.

అవతల వాళ్లు అతి కిరాతకంగా పెద్దకొడుకును చంపేస్తారు.

అన్న హత్యకు పగ తీర్చుకోవడానికి చిన్నకొడుకు బయల్దేరుతాడు. ఈ క్రమంలో నారప్ప తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనేదే కథ.

కుల వివక్షను డైల్యూట్ చేసి..

మాతృక ‘అసురన్’లోని ఎమోషన్స్ తెలుగులోనూ తేగలిగినా ఆ నేటివిటీ అంతగా కుదరలేదు.

‘అసురన్’లో 1980ల నాటి తిరునల్వేలి ప్రాంత వాతావరణాన్ని చూపించగలిగారు.

ప్రతీకార హత్యలు మాటిమాటికీ ఇబ్బంది పెడతాయి. ఒరిజనల్‌లో కుల వివక్షకు సంబంధించి ఉన్న సంభాషణలు తెలుగులోకి వచ్చేటప్పటికి ధనమదంలా కుదించినట్లుగా కనబడుతాయి.

అయితే, “ఒకే మట్టిలో పుట్టాం.. ఒకే భాష మాట్లాడుతున్నాం…”, “పేదోడికి కులం, మతం లేదు. ఉన్నోడికి మంచి, చెడు లేదు” వంటి డైలాగులు బాగున్నాయి.

‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ, చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు సిన్నబ్బా’ అనే డైలాగ్ కూడా పవర్‌ఫుల్‌గా ఉంది.

సంగీతం, పాటల సాహిత్యం సంగతి చెప్పకపోవడమే మంచిది.

మెప్పించిన వెంకటేశ్‌‌

బసవప్ప పాత్ర సహజంగా ఉంది. నారప్పగా వెంకటేష్ ఆహార్యం, నటనతో ఆకట్టుకున్నారు. టైటిల్ కార్డ్స్ లో బిరుదులు, ఇంటి పేర్లూ లేకుండా కేవలం “వెంకటేశ్” అని మాత్రమే వేసుకోవటం ముచ్చటగొలిపే విషయం.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా జాగ్రత్తగా మక్కీకి మక్కీ సీన్లు దింపినప్పటికీ, ఒరిజినల్ చూశాక, రీమేక్‌లో సోల్ లేదనపించటం సహజమే.

ఏమైనప్పటికీ, అణచివేతలు, గొప్ప పోరాటాలు వాటి పట్ల సినిమాలు రావడం, స్ఫూర్తి నింపటం ఏ తరంలోనైనా అవసరం. ఈ సినిమాను ఎంచుకోవడంలో వెంకటేశ్ ‘విక్టరీ’ సాధించారనే చెప్పొచ్చు.

తమిళ నేటివిటీ సహజంగా అక్కడ కుదిరింది. తెలుగులో యాస సరిగా కుదరకో, పాత్రల వల్లనో అంత సహజత్వం రాలేదు.

నారప్ప పాత్ర ఆహార్యం మాత్రం వయసుకు సరిపోవటం వల్ల ధనుష్ కంటే బాగా కుదిరినట్టు ఉంటుంది. తమిళంలో లాగా తెలుగులో మ్యూజిక్ ఆకట్టుకోలేదు.

పాటల్లో సాహిత్యం మరీ పేలవంగా ఉంది.

పంచాయితీ లాంటి సన్నివేశాలలో నలభై దశాబ్దాల కిందటి పరిస్థితులను సహజంగా చూపే ప్రయత్నం కనిపించింది.

(అభిప్రాయాలు వ్యక్తిగతం)

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img