Homeహైదరాబాద్latest Newsనాడీ వైద్యురాలి నయా ‘షో’.. తప్పును ప్రశ్నిస్తే.. అంతు చూస్తానంటూ బెదిరింపులు..!

నాడీ వైద్యురాలి నయా ‘షో’.. తప్పును ప్రశ్నిస్తే.. అంతు చూస్తానంటూ బెదిరింపులు..!

  • ఓ వ్యక్తితో ‘ఇదేనిజం’ కార్యాలయానికి ఫోన్లు.. అంతు చూస్తానంటూ బెదిరింపులు
  • సదరు వ్యక్తికి ఇదివరకే పలుసార్లు చెప్పుదెబ్బలు.. అయినా సిగ్గురాని వైనం

ఇదేనిజం, కరీంనగర్‌ క్రైం: నాడీ వైద్యం పేరిట కరీంనగర్‌లో దుకాణం తెరిచిన మహిళ వ్యవహారంపై ‘ఇదేనిజం’ దినపత్రికలో గత నెల 18న కథనాన్ని ప్రచురించింది. ఎలాంటి అర్హతలు లేకున్నా ప్రజలను మభ్యపెడుతూ చేస్తున్న వైద్యంపై వివరణాత్మకంగా తెలియజేసింది. అయితే తమ అక్రమ వ్యాపారానికి నష్టం చేకూరుతుందని భావించిన సదరు వైద్యురాలు.. విజయ్‌రెడ్డి అనే వ్యక్తి ద్వారా ‘ఇదేనిజం’ కార్యాలయానికి ఫోన్లు చేయించడం ప్రారంభించింది. సదరు వ్యక్తి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో (ప్రస్తుతం కూడా) సిరిసిల్ల ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించిన కీలక నేత వద్ద పనిచేసినట్లు సమాచారం. ఇంకేముంది తనను ఎవరూ ఏం చేయలేరనుకున్నాడో, ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడో గత 15 రోజులుగా ఫోన్లు చేస్తూ ‘మీరు ఎలా వార్త రాస్తారు? మీ సంగతి చూస్తానంటూ’ బెదిరింపులకు దిగడం ప్రారంభించాడు. సదరు ప్రబుద్ధుడు పలుసార్లు పలువురు మహిళలతో అసాంఘిక కార్యకలాపాలు నెరపి, చెప్పుదెబ్బలు కూడా తినడం గమనార్హం. అయినా కూడా సిగ్గు రాలేదు.

సిరిసిల్లలోనూ కార్యకలాపాలు
నాడీవైద్యం పేరిట సిరిసిల్లలో గాంధీచౌక్‌ ప్రాంతంలోనూ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ‘అక్షిత కేరళ ఆయుర్వేదిక్‌ బ్యూటీ పార్లర్‌ నాడీ చికిత్సాలయం’ పేరిట అమాయకులకు వచ్చీరాని వైద్యం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వైద్యం పేరుతో తమ వద్దకు వచ్చేవారి ప్రాణాల మీదకు తేకముందే సంబంధిత యంత్రాంగం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎలాంటి అనుమతి లేదు: వసంతరావు, డీఎంహెచ్‌ఓ, సిరిసిల్ల
సిరిసిల్లలో నిర్వహిస్తున్న ‘అక్షిత నాడీ చికిత్సాలయం’ గురించి సిరిసిల్ల డీఎంహెచ్‌ఓ వసంతరావును వివరణ కోరగా, తమ వద్ద నుండి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఎవరైనా గుర్తింపు లేకుండా చికిత్సలు చేస్తే విచారణ జరిపి శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

చర్యలు తీసుకుంటాం: అఖిల్‌మహాజన్‌, ఎస్పీ, సిరిసిల్ల
ఎలాంటి అర్హతలు లేకుండా చేస్తున్న నాడీ వైద్యంపై సిరిసిల్ల ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ దృష్టికి తీసుకెళ్లగా, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img