ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో టెడ్ సరాండొస్ హైదరాబాద్‌లో పర్యటించారు. తన మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి టాలీవుడ్ ప్రముఖులతో చర్చించారు. ‘ఎంతో దూరదృష్టి కలిగిన టెడ్ సరాండొస్, ఆయన బృందంతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన ఎన్నో భవిష్యత్తు ప్రణాళికలను చర్చించాం’అని సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలిపారు. ఇక ఈ ఫొటోల్లో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు.
మరోవైపు హైదరాబాద్ పర్యటనపై టెడ్ సరాండొస్ కూడా పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ , సుకుమార్, రాజమౌళి, వెంకటేశ్, నాగచైతన్య, రానాలను కలిసిన ఫొటోలను షేర్ చేశారు. ‘తెలుగు సినిమా లెజెండ్స్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమాలపై వారికి ఉన్న అంకితభావానికి నేను ఆశ్చర్యపోయాను. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందించారు. త్వరలోనే మళ్లీ కలుస్తాను’అని పోస్ట్ చేశారు. ఇక నెట్‌ఫ్లిక్స్ కో- సీఈవో టాలీవుడ్ ప్రముఖులందరినీ కలవడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీళ్లందరితో నెట్‌ఫ్లిక్స్ భారీ ప్రాజెక్టులను నిర్మించే ప్రయత్నం చేస్తోందా..? అని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.