దేశంలో రెండు కరోనా కొత్త స్ట్రెయిన్లు వెలుగులోకి వచ్చాయి. ఎన్440కె, ఈ484కె అనే రెండు కొత్త స్ట్రెయిన్లను మహారాష్ట్ర, కేరళ, తెలంగాణలో గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు ఈ వైరస్ స్వభావంలో అసాధారణ మార్పులేమైనా ఉన్నాయా? అని గమనిస్తున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.
కేసులు పెరగడానికి ఈ కొత్త స్ట్రెయిన్లు కారణమని ఆధారాలు లేవన్నారు. ఇకపోతే కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఇందులో దేశంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీరుపై సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుదలకు కొత్త వేరియంట్లే కారణమా? అనేది మూడు, నాలుగు రోజుల్లో తేలే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది.
దేశంలో ఏడు వేలపైగా కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు ఉన్నాయని.. వీటిలో చాలావరకు తీవ్ర ప్రమాదకారులని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు.
దేశంలో కరోనా జన్యు విశ్లేషణలో భారత్ వెనుకంజలో ఉందని ఆయన విశ్లేషించారు. కోటిపైగా కేసులు నమోదైనా.. అందులో 6,400 (0.06) నమూనాల జన్యువిశ్లేషణ మాత్రమే పూర్తయిందని అన్నారు.