తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజాగా నగరంలో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించేందుకు సిద్ధమైంది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి నమూనా చిత్రాలను జీహెచ్ఎంసీ అధికారులు విడుదల చేశారు. H–CITI లో భాగంగా రెండు ప్యాకేజీలుగా ఈ జంక్షన్లను జీహెచ్ఎంసీ నిర్మించనుంది. మొదటి ప్యాకేజీ కింద రెండు ఫ్లైఓవర్లు, మూడు అండర్ పాస్‌లు, సెకండ్ ప్యాకేజీలో 4 జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. సెకండ్ ప్యాకేజీలో నాలుగు ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. ఈ కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు పూర్తయితే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ మీదుగా హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.