New Railway Line: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కీలకమైన నల్లపాడు-బీబీనగర్ రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది రూ.452.36 కోట్ల నిధులను కేటాయించింది. ఈ మార్గం నిర్మాణం ఐదేళ్లలో ఆరు దశల్లో పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.
ప్రాజెక్టు పనులు పూర్తయిన వెంటనే ఈ మార్గాన్ని వినియోగంలోకి తీసుకునేలా అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ రెండో రైల్వే లైను పూర్తయితే, గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కేవలం 3 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడనుంది.