రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవాళ్లకే ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో రేషన్ కార్డు లేనివారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగానే కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. చాలా మందికి రేషన్ కార్డులు లేకపోయినా ప్రజా పాలన కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారికి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు వర్తించాలంటే కచ్చితంగా రేషన్ కార్డులు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా పౌరసరఫరాలశాఖ ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డుల కోసం ఆరు గ్యారెంటీల దరఖాస్తులతోపాటు విడిగా దరఖాస్తు తీసుకున్నారు. కానీ, వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. గతంలో మాదిరిగానే మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు తెలిసింది. దీంతో మళ్లీ రేషన్ కార్డులు లేనివారంతా మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి పరిస్థితి నెలకొన్నది.