అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం
పలు బిల్లులను ఆమోదించిన మంత్రిమండలి
హైదరాబాద్ః తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ బిల్లులతోపాటు వీఆర్వో వ్యవస్థను రద్దు బిల్లుకు కూడా మంత్రిమండలి ఆమోదం వేసింది. వీటితోపాటు టీఎస్ బీపాస్, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 సవరణ, తెలంగాణ జీఎస్టీ చట్టం-2017, తెలంగాణ సివిల్ కోర్టు చట్టం-1972 బిల్లులకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ఇంకా తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీల చట్టం సవరణ ఆర్డినెన్స్-2020, తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్-2020, తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ బిల్లు-2020లకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసినట్లు సీఎం తెలిపారు.
బీసీ జాబితాలో కొత్తగా 17 కులాల చేర్చేందుకు బీసీ కమిషన్ చేసిన సిఫార్సులు, తెలంగాణ కోర్టు వాల్యుయేషన్ చట్టం-1956 సవరణ బిల్లు, ఆయుష్ వైద్య కాలేజీలలో ఫ్యాకల్టీ రిటైర్‌మెంట్ ఏజ్ పెంపు ఆర్డినెన్స్, కొత్త సచివాలయ నిర్మాణంతోపాటు కూల్చేందుకు అయిన వ్యయాలకు సంబంధించిన పరిపాలను అనుమతులకు మంత్రి మండలి ఆమోదించింది.
45 రోజుల్లోనే భూ సమస్యల పరిష్కారం..
కొత్త రెవెన్యూ చట్టంలో టెక్నాలజీకి పెద్దపీట వేయనున్నారు. దరఖాస్తుదారు అర్జీ దాఖలు మొదలు.. సమస్య పరిష్కారం వరకు స్టేటస్ రిపోర్టును ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఏ అధికారి వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉంది? ఎందుకు ఉంది? అనే సమచారాన్ని దరఖాస్తుదారుడు తెలుసుకోవచ్చు. నూతన విధానం ద్వారా రైతుల భూ వివాదాలకు సులభంగా పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో అక్రమాలు, అవినీతిని అరికట్టేందుకు వీలవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు వేగంగా అర్జీల పరిష్కారం అవుతుందని, భూ వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసేలా కొత్త రెవెన్యూ చట్టంలో కసరత్తు చేశారు. భూ వివాదాలు 45 రోజుల్లో పరిష్కారం కాకుంటే.. అర్జీని నేరుగా కలెక్టర్‌కు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అక్కడా పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదిస్తారు. అక్కడా తీర్పు సంతృప్తికరంగా లేకుంటే రెవెన్యూ కోర్టుకు అప్పీల్ చేసుకునేలా కొత్త విధానం తీసేకురానున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 144 చట్టాలు లేదా నియమాల్లో కాలం చెల్లినవాటిని తొలగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త రెవెన్యూ చట్టం రూపొందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్ అబ్నార్ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ కొత్త చట్టం తయారీపై కసరత్తులు చేసింది.