Homeహైదరాబాద్latest Newsదీపావళికి నాటికీ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం.. !

దీపావళికి నాటికీ తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం.. !

కొత్త చట్టం RVR-2024 రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దీపావళికి ఆర్వీఆర్ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టులో ఆర్‌విఆర్-2024 చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంది. సెప్టెంబర్‌లో రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ప్రయోగాత్మకంగా భూ సర్వే నిర్వహించారు. చట్టానికి సంబంధించి సేకరించిన అభిప్రాయాలు, సూచనలు, పత్రాలు ప్రభుత్వానికి చేరాయి. గ్రామ స్థాయిలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో భూ కమిషన్‌ ఏర్పాటుచేయాలని అభిప్రాయాలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం-2020 స్థానంలో ఆర్వీఆర్ 2024 రూపకల్పనకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ముసాయిదాపై అభిప్రాయాలు సేకరించిన అధికారులు ముసాయిదా పత్రాన్ని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అందజేశారు. చట్టం రూపకల్పనకు సంబంధించిన కార్యక్రమాలపై మంత్రి ఇటీవల సీఎంతో చర్చించినట్లు సమాచారం. ఈ ముసాయిదాపై త్వరలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత, శాసనసభ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా లేదా ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా దీపావళి నుండి కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను నియంత్రించేందుకు కఠిన భూసేకరణ నిరోధక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై రెవెన్యూ న్యాయ నిపుణుల నుంచి మంత్రి పొంగులేటి తాజా సూచనలు, సలహాలు స్వీకరించినట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img