ఐపీఎల్ లో నిబంధనలను మార్చాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ బౌలర్లను కాపాడుకునే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ 11 ఏళ్ల నాటి ఆర్సీబీ 262 పరుగుల రికార్డును మూడుసార్లు బ్రేక్ చేసింది. హైదరాబాద్ టీమ్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆర్సీబీ రికార్డును ఓ సారి బద్దలుకొట్టింది. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 ఇన్నింగ్స్ స్కోర్ జాబితాలో నాలుగు స్కోర్లు ఈ ఏడాదే నమోదవ్వడం విశేషం. అయితే ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ రూల్ కారణంగానే భారీ స్కోర్ నమోదు అవుతుందని బీసీసీఐ భావిస్తుంది. ఈ నిబంధనతో బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే బ్యాటు-బంతికి సమానమైన పోటీ ఉండాలనే ఉద్దేశంతో ఓ ఓవర్‌లో రెండు బౌన్సర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ అది బౌలర్లకు ఉపశమనం ఇవ్వలేదు. దీంతో రూల్స్‌లో మార్పులు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అయితే బౌలర్లకు అనుకూలంగా రూల్స్ తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఒక బౌలర్‌కు గరిష్టంగా ఐదు ఓవర్లు, మిగిలిన వారికి నాలుగు ఓవర్లు కొనసాగించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో బౌలర్ నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలడు. మరో ఓవర్ ఇస్తే స్టార్ బౌలర్లతో కూడిన జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. దీని గురించి లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది.