హైదరాబాద్ః అన్నదమ్ములు, తండ్రికొడుకులు, సమాజంలోని అనేక వర్గాల మధ్య కొట్లాటకు కారణం భూ సమస్యలు, వాటిని అంతంచేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తన చట్టాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలకు తాగునీరు అందించే రూ.300 కోట్ల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కు పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా వద్ద శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుభీమా, కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులన్నా రాబోయే తరాల గుండెల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారన్నారు. 2003లో కృష్ణా నీళ్లను కలశంలో తీసుకుని వరంగల్ మహాసభకు సైకిల్ యాత్ర చేశామని, తెలంగాణ వస్తుంది .. తెలంగాణ వచ్చాక మాకు నీళ్లిచ్చే బాధ్యత మీది అని ఆరోజు కేసీఆర్ ని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. జూరాల ప్రాజెక్టు అడుగంటితే వనపర్తికి తాగునీరుండదని, 2017లో వనపర్తికి నీటి కోసం జూరాలలో అడుగంటిన నీటిలో మోటార్లను పెట్టి ఎనిమిది రోజులకోసారి నీళ్లివ్వాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి నాబార్డును ఒప్పించి ఈ రూ.300 కోట్ల ప్రాజెక్టును సాధించామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాబోయే రెండు తరాలకు కూడా వనపర్తి జిల్లాకు తాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, సీఈ చెన్నారెడ్డి, సీఈ జగన్మోహన్ పాల్గొన్నారు.