రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ః తెలంగాణ పంటల సాగు నమోదు విధానం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో శుక్రవారం సభ్యులు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణరెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమధానమిచ్చారు. నియంత్రిత సాగులో సూచించిన పంటల సాగును ప్రోత్సహిస్తూ పంటల నమోదు చేస్తున్నామని, ఇలాంటి కార్యక్రమం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ విధానం లేదన్నారు. 2604 ఏఈఓ క్లస్టర్ల ద్వారా ట్యాబ్ ల సాయంతో ఆన్ లైన్ లో పంటల నమోదు జరుగుతుందన్నారు. ఉద్యాన పంటలతో కలిసి కోటీ 41 లక్షల 8 వేల ఎకరాలలో పంట సాగు జరుగుతుందని మంత్రి వివరించారు. ఇందులో 59.70 లక్షల ఎకరాలలో పత్తి, 50.61 లక్షల ఎకరాలలో వరి, 10.60 లక్షల ఎకరాలలో కంది, 3.95 లక్షల ఎకరాలలో సోయాబీన్, 2.19 లక్షల ఎకరాలలో మొక్కజొన్న, 1.54 లక్షల ఎకరాలలో పెసర, 1.03 లక్షల ఎకరాలలో జొన్న సాగు అవుతున్నట్లు తెలిపారు.
రైతుబంధు కింద రూ.28 వేల కోట్లు జమ
రైతుబంధు పథకం కింద రూ.28,299.16 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 2018 వానాకాలం 50.25 లక్షల మంది రైతులకు రూ.5236.29 కోట్లు, యాసంగిలో 49.13 లక్షల రైతులకు రూ.5251.83 కోట్లు, 2019 వానాకాలం 51.61 లక్షల రైతులకు రూ.6125.54 కోట్లు, యాసంగిలో 42.42 లక్షల రైతులకు రూ.4406.48 కోట్లు, 2020 ఈ వానాకాలంలో 57.90 లక్షల మంది రైతులకు రూ.7279.02 కోట్లు రైతుబంధు కింద అందజేయడం జరిగిందని మంత్రి మండలిలో వివరించారు.
పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోన సాగు
పది లక్షల పై చిలుకు ఎకరాలలో తెలంగాణ సోన సాగు అవుతుందని మంత్రి తెలిపారు. పంటకాలం 125 రోజులు మాత్రమేనని పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువన్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ 51.50 శాతం మాత్రమే ఉండడంతో మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉపయుక్తంగా ఉండటంతో రైతుల దీని సాగుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
1526 వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం
తెలంగాణ వచ్చే నాటికి 1112 మందికి గాను ఉన్నది 707 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగం బలోపేతం నేపథ్యంలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ఏఈఓ నియామకం చేపట్టామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2638 మంది ఏఈఓలు పనిచేస్తున్నారన్నారు.
2601 రైతువేదికల నిర్మాణం
రూ.22 లక్షల వ్యయం చొప్పున రాష్ట్రంలో 2601 రైతువేదికల నిర్మాణం చేపట్టామని మంత్రి చెప్పారు. ఇందులో వ్యవసాయ శాఖ (రూ.12 లక్షలు), ఉపాధిహామీ పథకం (రూ.10 లక్షలు) నిధులు సమకూర్చుతున్నారు. రైతువేదికల కోసం ఇప్పటి వరకు భూదానం ఇచ్చిన దాతలు 136 మంది, నిర్మాణ ఖర్చుల దాతలు 24 మంది ముందుకు వచ్చారని మంత్రి చెప్పారు.