Homeవిచిత్రంLake of No Return : ఇండియన్‌ బెర్ముడా ట్రయాంగిల్‌.. 80 ఏండ్లుగా ఇక్కడకు వెళ్లినవారెవరూ...

Lake of No Return : ఇండియన్‌ బెర్ముడా ట్రయాంగిల్‌.. 80 ఏండ్లుగా ఇక్కడకు వెళ్లినవారెవరూ తిరిగిరాలేదు..

  • మిస్టరీగా అరుణాచల్‌ ‘లేక్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’
  • పలు అమెరికా సైనిక విమానాలూ అదృశ్యం
  • ముమ్మర ప్రచారంలో అదృశ్య శక్తుల కథలు
  • అవి కల్పనలని తోసిపుచ్చుతున్న శాస్త్రవేత్తలు

No one has ever returned from this ‘local Bermuda Triangle’ – All about ‘Lake of No Return’ near Arunachal Pradesh : శాస్ర్తానికే సవాల్‌ విసిరే ఎన్నో అంతుచిక్కని రహస్యాలు భూమండలం అంతటా విస్తరించి ఉన్నాయన్నది నిర్వివాదాంశం.

గత శతాబ్దకాలంలో 70కి పైగా విమానాలు, ఓడలను పొట్టనబెట్టుకున్న ‘బెర్ముడా ట్రయాంగిల్‌’ ప్రాంతం ఇప్పటికీ ఓ మిస్టరీనే.

అయితే, భారత్‌లో కూడా ఓ ‘బెర్ముడా ట్రయాంగిల్‌’ ఉన్నదని తెలుసా? ఆ సరస్సు పేరే ‘లేక్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’.

ఆ ప్రాంతం మర్మాన్ని తెలుసుకోవాలని గత 80 ఏండ్లలో ఆ సరస్సులోకి వెళ్లిన ఏ ఒక్కరూ ఇప్పటివరకూ తిరిగిరాలేదు.

ఎందుకు? ఆ నేపథ్యంపై ప్రత్యేక కథనం..

గతంలో ఏం జరిగింది?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైనికులు ‘లేక్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’ మీదుగా విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. సరస్సు పరిధిలోకి విమానం రాగానే సాంకేతిక సమస్యలు తలెత్తి రేడియో సిగ్నళ్లు కట్‌ అయ్యాయి.

దీంతో పదుల సంఖ్యలో విమానాలు కూలిపోయాయి. కూలిన విమానాల్లోని సైనికులను వెతుక్కుంటూ ఈ సరస్సు సమీపానికి వెళ్లిన అమెరికన్‌ సేనలు కూడా మళ్లీ తిరిగి రాలేదు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొందరు జపాన్‌ సైనికులు కూడా ఈ సరస్సులోకి దిగారని, అనంతరం మలేరియా వంటి జ్వరాలు సోకి.. వాళ్లు సరస్సు పరిసరాల్లోనే కనిపించకుండా పోయినట్టు స్థానికంగా చెబుతుంటారు.

ఇలాగే ఇజ్రాయెల్‌ నుంచి వలసపోతున్న పది తెగలను కూడా ఈ సరస్సు పొట్టనబెట్టుకున్నదని, వారి ఆత్మలు ఆ సరస్సు చుట్టుపక్కలే తిరుగుతున్నట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి.

‘లేక్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’ మిస్టరీని తెలుసుకోవాలని ఇప్పటివరకూ పలువురు అమెరికా, బ్రిటన్‌ సాహసయాత్రికులు ప్రయత్నాలు చేసి కనిపించకుండా పోయారు.

ఎక్కడ ఉన్నదీ సరస్సు?

మయన్మార్‌, భారత్‌ సరిహద్దుల్లో.. అరుణాచల్‌ప్రదేశ్‌లో పాంగ్‌ సౌ గ్రామంలో ‘నావోంగ్‌జాంగ్‌’ సరస్సు ఉన్నది.

1.4 కిలోమీటర్ల పొడవు, 0.8 కిలోమీటర్ల వెడల్పుతో అత్యంత సుందరంగా కనిపించే ఈ సరస్సును ‘లేక్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’ అని కూడా పిలుస్తారు.

ఎందుకంటే.. ఈ సర స్సు దరిదాపుల్లోకి వెళ్లిన వారెవరూ ఇప్పటివరకూ తిరిగిరాలేదు.

స్థానికులు చెబుతున్న కారణాలేంటి?

ఈ మిస్టరీ సరస్సు పరిసరాల్లో తాంగ్సా, బమార్స్‌, నాగా తెగల ప్రజలు నివసిస్తారు.

వాళ్ల కథనాల ప్రకారం.. వందల ఏండ్ల క్రితం ఈ సరస్సు పక్కన ఓ గ్రామం ఉండేది.

ఓ మత్స్యకారుడు ‘నావోంగ్‌జాంగ్‌’ సరస్సు నుంచి ఓ పెద్ద చేపను పట్టి.. ఊరందరికీ భోజనం పెట్టాడు.

అదే ఊరికి చెందిన ఓ ముసలమ్మను, ఆమె మనుమరాలిని ఆ విందుకు పిలువలేదు.

అవమానభారంతో ఆ ఇద్దరూ.. ‘నావోంగ్‌జాంగ్‌’లో దూకి చనిపోదామనుకున్నారు.

సరస్సు నుంచి వచ్చిన ఓ జలరూప ‘శక్తి’ వారిని ఊరడించి.. ఊరి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

వాళ్లు వెళ్లగానే ఊరి మొత్తాన్ని సరస్సు ముంచెత్తింది.

దీనికి తామే కారణమని న్యూనతకు లోనైన ఆ బామ్మ, మనుమరాలు సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

అప్పటినుంచి సరస్సు నీటిలో ఉన్న తన ఊరివాళ్లపై దాడి చేయడానికే వస్తున్నారని భావించిన నీటిలోని ఆ ముసలావిడ.. పెద్ద వెదురు కర్రతో విమానాలను, మనుషులను కొట్టి చంపుతున్నట్టు ప్రచారం ఉన్నది.

వైజ్ఞానికవేత్తలు ఏమంటున్నారు?

‘లేక్‌ ఆఫ్‌ నో రిటర్న్‌’పై ప్రచారాన్ని అమెరికాకు చెందిన పలువురు వైజ్ఞానికవేత్తలు తోసిపుచ్చుతున్నారు.

సరస్సుకు గుర్తింపు రావడానికే అక్కడి స్థానికులు ఇలాంటి కథలను ప్రచారం చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.

సరస్సు చుట్టూ మైదాన ప్రాంతం ఉండటంతో సరస్సును కూడా మైదానంలా ఊహించుకుని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు విమానాలను పొరపాటున ల్యాండింగ్‌ చేశారని, క్రాష్‌ అయ్యాయని వెల్లడించారు.

అయితే, విమాన శకలాలు ఏమయ్యాయి అన్నదానిపై వారు వివరణ ఇవ్వలేక పోతున్నారు .

Recent

- Advertisment -spot_img