Homeతెలంగాణపత్తి కొనుగోళ్ళకు సమస్యలు రావద్దు... మంత్రి సింగిరెడ్డి

పత్తి కొనుగోళ్ళకు సమస్యలు రావద్దు… మంత్రి సింగిరెడ్డి

పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి. 2020 – 21 కి సంబంధించి పత్తి కొనుగోళ్లపై శుక్రవారం అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సీఎండీ ప్రదీప్ కుమార్ అగర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాలని అధికారులకు సూచించారు. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణది మూడోస్థానం అని మంత్రి తెలిపారు.

గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది తెలంగాణలో మొత్తం పత్తి పంట మద్దతు ధరకు కొనుగోలుకు సీసీఐ సీఎండీ ప్రదీప్ కుమార్ అగర్వాల్ హామీ ఇచ్చారు.  21 శాతం ఉత్పత్తితో గుజరాత్, మహారాష్ట్రల తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. దేశంలో పత్తి విత్తనాల విలువ సుమారు రూ.2500 కోట్లు కాగా, పత్తి ఉత్పత్తి విలువ రూ.68000 కోట్లు ఉందన్నారు మంత్రి. ఈసారి వానాకాలంలో రాష్ట్రంలో 58.69 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని, గత ఏడాదికన్నా ఎక్కువ ఉత్పత్తి వస్తుందని తెలిపారు. 2019 – 20 సవంత్సరంలో సీసీఐ రూ.11749 కోట్ల విలువైన 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేసింది. పత్తి కనీస మద్దతుధర రూ.5825 బహిరంగ మార్కెట్ కన్నా ఎక్కువ ఉన్నందున పత్తి కొనుగోలు పరిమాణం పెంచాలని సీసీఐకి విజ్ఞప్తి చేశారు మంత్రి.

 ప్రభుత్వ నియంత్రిత వ్యవసాయానికి కట్టుబడి రైతులు పత్తి సాగుచేసిన నేపథ్యంలో వారికి మంచి రాబడి ఇప్పించుటలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రెట్టింపు అయిందని మంత్రి తెలిపారు. 2020 – 21 లో మద్దతుధరకు పత్తి కొనుగోలుకు గాను రాష్ట్రంలోని 314 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల జీఎస్టీ సమస్యపై సీసీఐ బాధ్యత తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరించాలని దిశా నిర్ధేశం చేశారు మంత్రి. ప్రస్తుతం గోదాములలో ఉన్న పత్తి బేళ్లను ఇతర ప్రదేశాలకు తరలించి కొత్త నిల్వలకు వెంటనే అవకాశం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.

సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిలో తేమ 8 నుండి 12 శాతం ఉండేలా అధికారులు రైతులను చైతన్య పరచాలన్నారు. పోయినసారి తెలంగాణ దేశంలో  పత్తి కొనుగోళ్లలో ప్రథమస్థానంలో నిలిచింది, గత ఏడాది మాదిరిగానే జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఈసారి పత్తి కొనుగోళ్లకు సహకరించాలి,  జిన్నింగ్ మిల్లుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి అంగీకరించిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ (సబ్సిడీ)  దశలవారీగా విడుదలకు కృషి చేస్తున్నామన్నారు. గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోళ్లకు ప్రణాళికాబద్దంగా సహకరించిన మంత్రివర్యులు, తెలంగాణ మార్కెటింగ్ శాఖకు సీసీఐ సీఎండీ ధన్యవాదాలు తెలిపారు. మార్కెటింగ్ అధికారులు, సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కలిసికట్టుగా సజావుగా పత్తి కొనుగోళ్లకు కృషిచేయాలన్నారు.

సమీక్షా సమావేశంలో మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి, సీసీఐ రాష్ట్ర బాధ్యులు పాణిగ్రహి, జిన్నింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img