తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మధిర మండలం దెందుకూరు గ్రామ ఉపాధి హామీ కూలీల సమస్యలను వ్యవసాయ కార్మిక సంఘం టౌన్ అధ్యక్షులు పల్లెకంటి వెల్సన్, మద్దాల ప్రభాకర్ తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలను ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు పనిచేయాలని అధికారులు ఒత్తిడి చేసి వేధిస్తున్నారని నిన్న ఈ రోజు ఉపాధి కూలీలు ఎండ తీవ్రతను తట్టుకోలేక, నిడలేక, తాగటానికి నీరు లేక వడదెబ్బ తాకి గుగ్గిల కామేశ్వరి, పరిమి జ్యోతి, నర్సింగ్ పేరమ్మ, కందుల పద్మ సొమ్మసిల్లి పడిపోయారని మధిర కెవిఆర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని వైద్యం కోసం ఖర్చయిన ఖర్చు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
నడి ఎండలో పపనిచేసే ప్రదేశాలలో కూలీలకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని పని ప్రదేశాలలో వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు పిల్లల తల్లులకు దివ్యాంగులకు, ఇతర కూలీలకు నీడ కోసం టెంట్లు సౌకర్యం కల్పించాల్సి ఉన్న కల్పించట్లేదని, దూర ప్రాంతాలకు పనిచేయడానికి వెళ్తే ఆటో సౌకర్యం కల్పించాల్సి ఉన్న ఉపాధి కూలీలే ఛార్జీలు పెట్టుకొని లేదా నడిసి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ఉపాధి పని దగ్గర ప్రాంతంలో పని చూపించాల్సి ఉన్న అలా చూపించకుండా అధికారులు, ప్రభుత్వo నిర్లక్ష్యం చేస్తూ దివ్యాంగులకు ఉన్న ప్రత్యేక చట్టాన్ని నీరు కార్చడం సిగ్గుచేటున్నారు. తీవ్రమైన ఎండలో పనిచేస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదని, నీడ, త్రాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్, ఓ ఆర్ ఎస్ సౌకర్యం లేక ఎండలో పనిచేస్తున్న కూలీలకు వడదెబ్బ తాకి అనారోగ్యం పాలవుతున్నారని ఇది పూర్తిగా ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల వైఫల్యమని విమర్శించారు.
మేటిలు లేకపోవడం వల్ల హాజరు నమోదు, ఫోటోలు తీసే సమయంలో గందగోళ పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చేసిన పని స్లిప్పులు ఇవ్వాలని చేసిన పనికి వారం వారం డబ్బులు చెల్లించాలని, ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీ డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. కొలతలు, ఇతర నిబంధనలు లేకుండా కనీస కూలి 400 రూపాయలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ చట్టంలో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉపాధిహామీ కూలీల సమస్యలు పరిష్కారం చేయాలని లేదంటే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మధిర మండల అభివృద్ధి (ఎంపిడివో )కార్యాలయం ముందు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం టౌన్ అధ్యక్షులు పల్లెకంటి వెల్సన్, అల్లూరి నాగేశ్వరరావు, నరసింహారావు, కుమారి తదితరులు పాల్గొన్నారు..