Homeహైదరాబాద్latest Newsఅయ్యో కారు.. పాపం సారు.. బీటలు వారుతున్న బీఆర్ఎస్ గోడలు!

అయ్యో కారు.. పాపం సారు.. బీటలు వారుతున్న బీఆర్ఎస్ గోడలు!

  • కండ్లముందే కుప్పకూలుతున్న సామ్రాజ్యం
  • అయినా గట్టిగా ప్రశ్నించలేని దైన్యం..
  • బీఆర్ఎస్ నుంచి చేజారుతున్న ఎమ్మెల్యేలు
  • చివరకు మిగిలేది పదిమందేనా? అన్న డౌట్స్​
  • ఎమ్మెల్సీలదీ అదే బాట.. రేపో మాపో వారు జంప్​
  • నాడు కోరితెచ్చుకున్న నేతలే వీడిపోతున్నారు..
  • నీవు నేర్పిన విద్యయేకదా నీరజాక్ష అంటున్న హస్తం
  • ఎవ్వరూ ఊహించని రీతిలో గులాబీ పార్టీ పతనం
  • ప్రజా పోరాటాలే ఆ పార్టీ మనుగడకు ఆధారం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కండ్లముందే బీఆర్ఎస్ సామ్రాజ్యం కుప్పకూలుతోంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. బుజ్జగింపులు పనిచేయడం లేదు.. భవిష్యత్​ పై భరోసా ఇచ్చినా ఆగడం లేదు. ఉదయం అధినేతతో మీట్​ అయి సాయంత్రానికి గుడ్ బై చెప్పేస్తున్నారు ఎమ్మెల్యేలు. బహుశా ఈ దేశ చరిత్రలో ఏ పార్టీకి ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయి పతనం వచ్చి ఉండదేమో.. బీఆర్ఎస్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఏమీ కలగలేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కానీ ఆ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఇప్పుడు గులాబీ పార్టీమీద విశ్వాసం ఉంచడం లేదు. ఒకరితర్వాత ఒకరు మెజార్టీ ఎమ్మెల్యేలంతా పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో పట్టుమని ఓ పదిమంది ఎమ్మెల్యేలు అయినా ఉంటారా? అన్న సందేహాలు వక్తమవుతున్నాయి. కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, పల్లారాజేశ్వర్​ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి లాంటి నేతలు మినహా మిగిలిన ఎవర్నీ వీరు పార్టీలో కొనసాగుతారా? అంటే కచ్చితంగా ఉంటారు అని చెప్పలేని పరిస్థితి.. అంతటి దయనీయంగా మారిపోయింది బీఆర్ఎస్.

కాంగ్రెస్ పాలన అంత గొప్పగా ఉందా?
ఈ ఆరు నెలల కాలంగా కాంగ్రెస్ పాలన అంత గొప్పగా ఉందా? ఆ పార్టీ మొదలపెట్టిన భారీ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే విప్లవాత్మక మార్పులు ఏమైనా చేసిందా? గొప్ప సంస్కరణలు చేసిందా? చెప్పిన హామీలు తుచ తప్పకుండా అమలు చేస్తున్నారా? అంటే ఆ పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ మీద నమ్మకం కుదరడం లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ వ్యాపారాలు సజావుగా సాగవు. ఎమ్మెల్యేగా ఉన్నా ఏ విలువ ఉండటం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన సెగ్మెంట్ లోనూ కాంగ్రెస్ నేతల పెత్తనం కొనసాగుతోంది. విపక్ష ఎమ్మెల్యే పోస్ట్​ ఓ ఉత్సవ విగ్రహంలా మారిపోయింది. పైగా వ్యాపార సంస్థలపై దాడులు జరగొచ్చు. అక్రమాస్తులపై ఎంక్వైరీలు మొదలుకావొచ్చు. ఇంత రిస్క్ చేసి బీఆర్ఎస్​ పార్టీలో ఉండేబదులు.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఈ ఐదేండ్లు ఎంజాయ్ చేయొచ్చు. పైగా ఇప్పుడు ప్యాకేజీ అందుతుంది. కేసులు ఉండవు.. దాడులు ఉండవు. తమ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసుకోవచ్చు. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు ఈ లెక్కలు వేసుకొనే జారుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఉదయం వింటారు.. సాయంత్రం కప్పుకుంటారు..
కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. ఇటీవల కాలె యాదయ్య అనే ఎమ్మెల్యే ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి వెళ్లాడు. అధినేత మాటలు విన్నాడు.. మీతోనే ఉంటానన్నాడు.. కానీ సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. యాదయ్య లాంటి ఎమ్మెల్యేలు ఇలా షాక్ ఇస్తుంటే.. కొంతమంది డైరెక్ట్ గా తాము పార్టీ మారుతున్నామని చెప్పే పార్టీ మారుతున్నారట. తమకు బీఆర్ఎస్ అంటే అభిమానమే.. పార్టీలో ఉండాలని ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగలేమని తేల్చి చెబుతున్నారట. అధినేతకు చెప్పిమరీ పార్టీ మారుతున్నారట.

లెక్కలు సెటిల్ చేసుకొని..
చాలామంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్యాకేజీలు మాట్లాడుకున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఓ పది మంది మినహా మిగిలన వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఒకరిద్దరు కాషాయపార్టీ వైపూ చూస్తున్నారట. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఎంత ప్యాకేజీ ఇస్తారు? ఏయే ప్రయోజనాలు చేకురుస్తారు? వంటి విషయాలు మొత్తం ఇప్పటికే మాట్లాడేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మరికొందరు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి పిలుపు రాకున్నా.. రాయబారాలు పంపుతున్నారట. మమల్ని ఎవరూ సంప్రదించడం లేదేమిటి? అని వాపోతున్నారట. కార్యకర్తలలతో సమావేశాలు పెట్టుకొని.. మధ్యవర్తులతో మాట్లాడి గోడ దుంకేందుకు రెడీ అయిపోయారట. ఇటువంటి వాళ్లతో కాంగ్రెస్ పార్టీకి చేరికల వ్యవహారం సులవయ్యింది. ఇక నియోజకవర్గానికి సంబంధించిన నేతలు, వారి అనుచరగణం మొత్తం పార్టీ మారడంతో చేసేది లేక కండువా కప్పుకున్న నేతలూ ఉన్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం విలీనం అయ్యే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీల పరిస్థితి..
ఎమ్మెల్యే బాటలోనే ఎమ్మెల్సీలు పయనిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ ఏరి కోరి మరీ కొంతమందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ బలోపేతం అవుతుందని.. ఎమ్మెల్యేకు తోడు.. ఎమ్మెల్సీలు కూడా సపోర్ట్ చేస్తే నియోజకవర్గాల్లో తమకు తిరుగు ఉండదని ఆయన భావించారు. అనేకమంది సీనియర్​ లీడర్లకు గౌరవం కోసం కూడా పదవి కట్టబెట్టారు. కానీ అటువంటి ఎమ్మెల్సీలు కూడా మూకుమ్మడికి బీఆర్ఎస్ పార్టీకి గుడ్​ బై చెబుతున్నారట. ఇందుకు కేసీఆర్​ సొంత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్​ రావు మధ్యవర్తిత్వం నడుపుతున్నారట. తనతోపాటూ ఆ 10 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడేందుకు రెడీ అవుతున్నారట. మరికొంతమందిని చేర్చుకొని మొత్తం శాసనమండలినే వీలినం చేసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్లాన్​ అని తెలుస్తోంది. ఎమ్మెల్సీలు సీనియర్​ లీడర్లు విధేయతతో ఉంటారని భావిస్తే వారంతా జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారట. బీఆర్ఎస్ ముఖ్యనేతలు భాను ప్రసాద్​ రావు సంప్రదిస్తే తాను పార్టీలో ఉండలేనని తేల్చి చెప్పారట.

కుంగిపోతున్న కేసీఆర్​
ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ తీవ్రంగా కుంగిపోతున్నారట. ఓ వైపు సొంత కూతురు జైళ్లో ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. దీంతో ఆయన కుంగుబాటుకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ తీవ్రంగా మథనపడుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ప్రస్తుతం ఎంతో మారిపోయారు. గతంలో కంటే భిన్నమైన రాజకీయాలు చేస్తున్నారు. నిత్యం ప్రజలు, పార్టీ నేతలతోనే ఉంటున్నారు. ఎర్రవల్లి కేంద్రంగా రాజకీయం నడుపుతున్నాడు. అయినప్పటికీ పార్టీ రోజురోజుకు బలహీనపడుతుండటంతో ఏ చేయాలో ఆయనకు పాలుపోవడం లేదట. ఎంత వారించినా ఎమ్మెల్యేలు వినడం లేదట. తమకు బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా దెబ్బతీస్తే తట్టుకోలేం అని చెబుతున్నారట. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లుల కోసం పార్టీ మారడం గమనార్హం. ఇక ఈ మొత్తం వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదే కీలక పాత్ర అని తెలుస్తోంది. చాపకింద నీరులా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేందుకు ఆయన కుట్ర చేస్తున్నారు. చేరబోయే ఎమ్మెల్యేలకు ప్యాకేజీ సెట్​ చేయడం.. కాంట్రాక్టులు అందజేయడం మొత్తం పొంగులేటి పని. కేటీఆర్ , హరీశ్ రావు ఎంత ప్రయత్నం చేసినా.. ఏ ఒక్క ఎమ్మెల్యేను ఆపలేకపోతున్నారు.

ప్రజల్లో నో సింపతి
సహజంగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే వారి మీద ప్రజల్లో వ్యతిరేకత కనిపించాలి. చీత్కారం ఉండాలి. కన్న తల్లి లాంటి పార్టీని విడిచి పెట్టి పోతున్నందుకు తిరుగుబాటు రావాలి. కానీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ పట్ల సానుభూతి వ్యక్తం కావడం లేదు.. సదరు ఎమ్మెల్యేల పట్ల అసహనం కూడా కనిపించడం లేదు. అందుకు కారణం బీఆర్ఎస్ వైఖరే అన్న చర్చ జరుగుతోంది. 2014ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కేవలం 63 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టింది. అది బొటాబొటి మెజార్టీ. అప్పట్లో ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయన్న వార్తలు వచ్చాయి. దీంతో కేసీఆర్​ అలర్ట్ అయిపోయి కాంగ్రెస్, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. దీనికి ప్రజలు హర్షించారు తప్ప వ్యతిరేకించలేదు. అయితే 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 88 సీట్లు కట్టబెట్టారు. సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం.. శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవడాన్ని ప్రజలు సహించలేపోయారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్న భావన జనంలోకి బలంగా వెళ్లింది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నోరు లేకుండా పోయింది. కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను అనైతికంగా చేర్చుకుంటుంది అని ఆరోపణ వచ్చినప్పుడు.. మరి మీరు గతంలో చేసిందేంటి? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ డిఫెన్స్​ లో పడిపోయింది.

బీఆర్ఎస్ పుంజుకొనే చాన్స్​ లేదా?
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ద్వితీయశ్రేణి కేడర్​ మొత్తం చేజారిపోతున్నది అసలు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పుంజుకోవడం సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి బీఆర్ఎస్ అవసరం తెలంగాణకు ఉంది. తెలంగాణ అస్థిత్వానికి ప్రమాదం జరిగితే ప్రశ్నించే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే. పోయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల గురించి పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్మించుకుంటే .. నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించగలిగితే కచ్చితంగా గులాబీ వికసించే చాన్స్​ ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img