సోనూసూద్ సినిమాల్లో విలన్‌గా చేసినా.. నిజ జీవితంలో మాత్రం హీరోనే అని అనిపించుకున్నాడు. కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు యావత్ భారతదేశం ప్రశంసల వర్షం కురిపించింది. ఆ తర్వాత కూడా ఎంతో మందికి సాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఈసారి ఓ మూడేళ్ల చిన్నారికి జీవతాన్ని ఇచ్చాడు. మూడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేసి సోనూసూద్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఖమ్మం జిల్లా చెన్నూరుకు చెందిన కృష్ణ, బిందు ప్రియలది నిరుపేద కుటుంబం. వీరి మూడేళ్ల కుమార్తె చిన్నప్పటి నుంచి గుండె జబ్బుతో బాధపడుతోంది. చిన్నారికి గుండె శస్త్రచికిత్స చేయాలంటే రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్థితి లేని కృష్ణ, బిందుప్రియ సహాయకుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లింది. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న సోనూసూద్.. వెంటనే ముంబైలో చిన్నారికి ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారు. కష్టాల్లో ఉన్న చిన్నారి ప్రాణాలను కాపాడి తన గొప్ప మనసును మరోసారి సోనూసూద్ చాటుకున్నాడు.