Once again the center is ready for the GST review : వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన రెండు కీలక కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది.
ఒక కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వం వహిస్తారు, మరొక కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యం వహిస్తారు.
వీటిపైనే దృష్టి
రేట్ స్లాబ్‌లు- విలీనం, జీఎస్‌టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారించడానికి మార్గాల అన్వేషణ, ట్యాక్స్ బేస్ పెంపు తత్సంబంధ అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
క్లిష్టమైన పరోక్ష పన్ను రేట్ల వ్యవస్థలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకువస్తూ, నాలుగేళ్ల క్రితం (2017 జూలై నుంచి) జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థను మరింత సరళతరం చేయడంపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కమిటీలు ఇలా…
బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది.
ఈ కమిటీలో పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్ బాలగోపాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి తార్‌కిషోర్ ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉంటారు.
మరో ఎనిమిది సభ్యులతో కూడిన కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహిస్తారు.
వీరిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి టీఎస్ సింగ్ డియో ఉన్నారు.
ఈ నెల 17న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో లక్నోలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ ఈ కమిటీల ఏర్పాటు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత రేట్ల వ్యవస్థ ఇదీ…
ప్రస్తుతం ప్రధానంగా నాలుగు జీఎస్‌టీ రేట్ల వ్యవస్థ అమలవుతోంది. నిత్యావసరాలపై కనిష్టంగా 5 శాతం పన్ను అమలవుతుండగా, కార్లపై అత్యధికంగా 28 శాతం పన్ను విధింపు ఉంది.
12 శాతం, 18 శాతం పన్ను స్లాబ్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ, పొగాకు వంటి డీమెరిట్, సిన్ గూడ్స్‌పై ఉన్న అత్యధిక 28 శాతంపై సెస్ విధింపు కూడా అమలు జరుగుతోంది.
12 శాతం 18 శాతం శ్లాబ్‌లను ఒకటిగా చేయాలన్న డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తోంది.
మినహాయింపుల కేటగిరీ నుంచి కొన్ని ఉత్పత్తులను తొలగించి, స్లాబ్‌ల హేతుబద్ధీకరణ వల్ల జరిగే రెవెన్యూ నష్టాలను పూడ్చుకోవాలని కూడా కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇక తుది వస్తువులపై దాని ఇన్‌పుట్‌లపై విధించే పన్ను కంటే తక్కువ రేటును విధింపు (ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్) విషయంలో పన్ను వ్యత్యాసాలను ఇప్పటికే జీఎస్‌టీ కౌన్సిల్ తొలగించింది.
మొబైల్ హ్యాండ్‌సెట్, పాదరక్షలు, వస్త్రాల విషయంలో ఈ రేటు వ్యత్యాసాలను సరిచేస్తూ సవరణలు జరిగాయి.
పెట్రోలు విషయంలో..
జీఎస్‌టీ వ్యవస్థ అమల్లోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్ ఆయిల్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు.
పెట్రో ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కొనసాగించడానికి ఈ విధానం దోహదపడుతోంది.
పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోనికి తీసుకుని రావాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన అత్యున్నత స్థాయి విధాయక మండలి అసలు ఆ అంశంపైనే చర్చించకూడదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
దీనివల్ల ఇటు రాష్ట్రాలు, అటు కేంద్రం ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండడమే కౌన్సిల్ నిర్ణయానికి కారణం.