HomeతెలంగాణOrganic Farming : పాత‌కాలం వ్య‌వ‌సాయం.. ఎకరంలో పది రకాల పంటలు..

Organic Farming : పాత‌కాలం వ్య‌వ‌సాయం.. ఎకరంలో పది రకాల పంటలు..

Organic Farming : పాత‌కాలం వ్య‌వ‌సాయం.. ఎకరంలో పది రకాల పంటలు..

Organic Farming – ఆధునిక వ్యవసాయంలో అధిక రసాయనాల వినియోగంతో భూమి సారం దెబ్బతినడంతో పాటు పంటలు కలుషితమవుతున్నాయి.

అధిక దిగుబడుల కోసం ఉపయోగిస్తున్న యూరియా, ఎరువులు ప్రజలు రోగాల బారిన పడేలా చేస్తున్నాయి.

అయితే, ఇరవై సంవత్సరాలకు ముందు సాగు విధానం అంతా ప్రకృతిసిద్ధంగా జరిగేది.

ప్రతీ ఇంట్లో పశుసంపద పుష్కలంగా ఉండేది. కనీసం రెండు ఎడ్లు, ఒక ఆవు, ఒక బర్రె, మేకలు, కోళ్లు ఉండేవి. విత్తనాలను స్వయంగా తయారు చేసుకుని భద్రపరుచుకునేవారు.

ఇంట్లోనే స్వచ్ఛమైన పాలు సిద్ధంగా ఉండేవి. ఇప్పుడున్న ఎరువుల స్థానంలో పశువుల (సేంద్రియ) ఎరువును వినియోగించి అధిక దిగుబడులు సాధించేవారు.

పచ్చజొన్న, తెల్లజొన్న, గోధుమలు, సజ్జలు, రాగులు, నువ్వులు, తొగరి(కందులు) శనగ, కుసుమ, ధనియాలు, పొగాకు, పంటలు పండించే వారు.

తెల్ల కుసుమలు, పల్లికాయలతో గ్రామాల్లోనే గిర్నిలో నూనె పట్టించుకునేవారు.

ఏడాదికి కావల్సిన బియ్యం, జొన్నలు, పప్పులు, నూనె ఇంట్లో నిల్వ చేసుకోనే వారు.

కాలక్రమంలో ఈ పంటల సాగును వదిలేసిన రైతులు వరి, పత్తి, చెరుకు లాంటి నాలుగైదు పంటల సాగుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు పాత పంటలవైపు పలువురు రైతులు దృష్టి సారిస్తున్నారు.

తక్కువ పెట్టుబడి, డిమాండ్‌ ఉన్న పాత పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రతి ఏడాది పంటమార్పిడి చేసి తీరొక్క పంటలు పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.

తీరొక్క పాత పంటలు సాగు..

జహీరాబాద్‌ ప్రాంతంలో రైతులు వ్యవసాయ బోర్లు, బావులు, వర్షాధారంగా తీరొక్క పంటలు సాగు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పంటమార్పిడి చేసి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసేలా ప్రోత్సహించింది.

సర్కారు ప్రోత్సాహం, రైతుల పట్టుదలతో చిరుధాన్యాలు (పాత పంట)లు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

చిరుధాన్యాలను వర్షాధారంగా సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నారు.

పచ్చజొన్న, తెల్లజొన్న, గోధుమలు, సజ్జలు, రాగులు, నువ్వులు, తొగరి(కందులు) చెరుకు, అల్లం, శనగ, కుసుమ, నల్లకుసుమ, పత్తి పంటలను కూడా సాగు చేస్తున్నారు.

పలు పంటలను మార్కెట్‌లో కాకుండా కొన్ని కంపెనీలకు నేరుగా విక్రయిస్తున్నారు.

అల్లం, ఉల్లి, వెల్లుల్లి, మిర్చి, నువ్వులు, కొత్తిమీర, జహీరాబాద్‌, హైదరాబాద్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు.

ప్రతి ఏడాది పంట మార్పిడితో సాగు..

రైతులు ప్రతి ఏడాది పంటమార్పిడి పాటిస్తున్నారు.

పచ్చజొన్న, తెల్లజొన్న, తొగరి, శనగ, మినుము, పెసర, సజ్జ, నువ్వులు, ఆరుతడి వర్షాధారంగా సాగుచేస్తారు.

యాసంగిలో తెల్లజొన్న, శనగ పంటలకు రెండు తడులు నీరు పెడుతున్నారు.

మిగతా పంటలకు ఒక తడి ఇస్తే సరిపోతుంది. ఆరుతడి పంటలకు పెట్టుబడి తక్కువగానే ఉంటుంది.

వానకాలంలో రైతులు పచ్చజొన్న, మినుము, పెసర, సోయా, పత్తి పంటలను సాగు చేస్తున్నారు.

యాసంగిలో తొగరి, శనగ, తెల్లజొన్న, నువ్వులు, సజ్జలు, ఆవాలు, గోధుమ పంటలు సాగు చేస్తున్నారు.

వీటితో పాటు ఆలుగడ్డ, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, మిర్చి పంటలు పండిస్తున్నారు.

ఎకరం భూమిలో పది రకాల పంటలు ..

ఎకరం భూమిలో పది రకాల పంటలను సాగు చేసి అదర్శంగా నిలుస్తున్నారు స్థానిక రైతులు.

జీవవైవిధ్య పంటలకు పశువులపేడతో తయారు చేసిన సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నారు.

రసాయన ఎరువులు వాడకంతో పొలంలోని ప్రకృతి సంపద, భూసారం తగ్గిపోయి పంటలకు నష్టం జరుగుతుంది.

దీంతో వర్షాధార పంటలు సాగుచేసి జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నారు.

జొన్న, సజ్జ, కొర్ర, సామ గింజలో అపారమైన పౌష్టకాహారం ఉంటుంది.

చిరుధాన్యాల పంటలతో ఆరోగ్యం, పశుసంపద, పర్యావరణాన్ని కాపాడుతూ జీవవైవిధ్యానికి జీవం పోస్తున్నారు.

అధికంగా రసాయన ఎరువుల వినియోగంతో జంతువులు, పక్షి జాతులు కనుమరుగైపోతున్నాయి.

పాత పంట(Organic Farming)లో అధిక పోషకాలు ..

బియ్యం, గోధుమలతో పోలిస్తే, చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి.

చిరుధాన్యాల్లో 30 నుంచి 300 శాతం వరకు క్యాల్షియం, ఖనిజ లవణాలు, ఇనుము, పీచు, పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.

అంతరించి పోతున్న పంటల సాగు వైపు రైతులు ..

జీవవైవిధ్య పంటలైన తెల్లజొన్న, పచ్చజొన్న, ఎర్రజొన్న, తెల్లకొర్ర, మంచికొర్ర, నల్లకొర్ర, ఎర్రకొర్ర, తెల్లతైదలు, ఎర్రతైదలు, తెల్లసామ, నల్లసామ, కోడిసామ, ఆర్గులు, సజ్జలు, మంచిపెసరి, గంగపెసరి, బాలెంతపెసరి, తీగపెసరి, దేశీమినుములు, గడ్డినువ్వులు, తెల్లజమాల్‌ నువ్వులు, ఎర్రతొగరి, బుర్కతొగరి, తెల్లతొగరి, నల్లతొగరి, తెల్లఅనుములు, నల్లఅనుములు, ఎర్ర అనుములు, ఎర్రబెబ్బర్లు, తెల్లబెబ్బర్లు, బైలుమక్కలు, ఉల్లలు(ఎర్రవి,తెల్లవి,నల్లవి) ఎర్రపుండి, తెల్లపుండి, పెద్దబయిముగు, బైలు నల్లబుడ్డివడ్లు, బైలు ఎర్రవడ్లు, బైలుతెల్లబుడ్డవడ్లు, బైలు ఉల్లిగడ్డ పంటలను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాసంగిలో రైతులు సాయిజొన్నలు, ఎర్రజొన్న, ప్యాలాలజొన్న, దేశీ శనగలు (ఎర్రవి, నల్లవి, తెల్లవి) పండిస్తున్నారు. ఆవాలు నల్లబటగాల్లు, తెల్లబటగాల్లు, దేశీ మిరప, ధనియాలు, నల్లముల్లు గోధుమ, కట్టె గోధుమలు, బుడ్డగోధుమ, శిరి శనగ (నల్లవి, చిన్న, పెద్దవి), లంకలు, అవిశలు తదితర జీవవైవిధ్య పంటలను పండిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img