ORR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 14 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది, ఇప్పటికే 140 అడుగుల వెడల్పుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇది మరో ముందడుగుగా పరిగణించబడుతోంది.
కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పాటు, ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేసింది. అంతేకాకుండా, రైల్వే, రవాణా ప్రాజెక్టులను కూడా కేటాయించి అమరావతి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం కృష్ణా జిల్లాలోని కంకిపాడు మరియు తోట్లవల్లూరు మండలాల్లో 10 గ్రామాల్లో 390.12 ఎకరాల భూమి సేకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కంకిపాడు మండలంలో మారేడుమాక, కోలవెన్ను, నెప్పల్లి, దావులూరు, చలివేంద్రపాలెం గ్రామాలు, అలాగే తోట్లవల్లూరు మండలంలో బొడ్డపాడు, చినపులిపాక, వల్లూర్ నార్త్, వల్లూరు సౌత్, రొయ్యూరు గ్రామాల్లో భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.