OTT Block Buster : స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా భారీ అంచనాలతో రూపొందింది. 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా వీరి మునుపటి కల్ట్ క్లాసిక్ ‘నాయకన్’ (1987) తర్వాత మరో గొప్ప గ్యాంగ్‌స్టర్ డ్రామాగా నిలుస్తుందనే భావన అభిమానుల్లో నెలకొంది. అయితే జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా మారింది.
ఈ సినిమా రూ. 200-300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. కమల్ హాసన్‌తో పాటు శింబు , త్రిష నటించిన ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. అయినప్పటికీ కథ, స్క్రీన్‌ప్లేలోని లోపాలు, ఊహించిన స్థాయిలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వంటి కారణాలతో ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనలను, ప్రేక్షకుల నుంచి నెగటివ్ రిస్పాన్స్‌ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 97.25 కోట్లు మాత్రమే వసూలు చేసి, భారీ నష్టాలను మిగిల్చింది.
ముందుగా ఎనిమిది వారాల థియేట్రికల్ విండో తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో, జూలై 3న అంటే థియేట్రికల్ రిలీజ్ అయిన నెలలోపే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో అద్భుతమైన స్పందనను రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచి, రెండు రోజుల్లోనే భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.