పట్టణాల్లో ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేస్తే చాలు.. చాలా మంది టిఫిన్స్ బయటచేస్తుంటారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో అస్సలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వంట మానేసి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తింటున్నారు. అంతేకాదు.. బయట హోటల్లో, రోడ్డు పక్కన ఉండే టిఫిన్స్ పై ఆధారపడుతూ ఉంటారు. ఈ కారణంగా ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. బయట ఫుడ్ ప్రిపేర్ చేసేవారు కొంతమంది శుభ్రతను పాటిస్తే.. మరికొంతమంది దోమలు, ఈగలు, పురుగులు ఉన్నది చూసుకోకుండా అలాగే ప్రిపేర్ చేస్తారు.
తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వంటగదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పూరీలు చేస్తున్నాడు. పూరీల కోసం తయారు చేసిన పిండిని ఎలుకలు స్క్రాప్ చేయడం వీడియోలో కనిపించింది. కాగా పక్కనే కూర్చున్న ఆ వ్యక్తి ఎలుకలను పట్టించుకోకుండా పూరీలు వేయిస్తున్నాడు. ఈ వీడియో పీఎఫ్సీ క్లబ్ వ్యవస్థాపకుడు, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ చిరాగ్ బర్జాత్యా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘‘ఏదైనా ఆహారం తినేముందు వంటగదిని ఓసారి చెక్ చేయండి. ఇది చూడటానికి చాలా ఆందోళనకరంగా ఉంది’’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. వీళ్లకు వినియోగదారుల న్యాయస్థానం ద్వారా శిక్ష పడేలా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది ఈ వీడియో క్లిప్ కర్ణిమాత దేవాలయానికి సంబంధించిందని అంటున్నారు.