ఇస్లామాబాద్: బాలీవుడ్ నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్‌ల పూర్వీకుల ఇళ్లను కొనుగోలు చేయాలని పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కూల్చివేయకుండా.. నేషనల్ హెరిటేజ్‌గా గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
పెషావర్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవనాలు ప్రస్తుతం వేరే వారి ఆధీనంలో ఉన్నాయి. వీటి ధరను నిర్ణయించడానికి పెషావర్ డిప్యూటీ కమిషనర్‌ను అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
రాజ్ కపూర్ పూర్వీకుల నివాసాన్ని కపూర్ హవేలీ అని పిలుస్తారు. ఇది కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉంది. దీనిని 1918-22 మధ్య కాలంలో దిగ్గజ నటుడి తాత దేవాన్ బాషేశ్వర్‌నాథ్ కపూర్ నిర్మించారు. రాజ్ కపూర్, అలానే అతని మామ త్రిలోక్ కపూర్ ఈ భవనంలో జన్మించారు. దీనిని ప్రాంతీయ ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది.
ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ 100 సంవత్సరాల పురాతన పూర్వీకుల ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉంది. ఈ ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. 2014 లో అప్పటి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వంగా ప్రకటించింది.
ఇవే కాకుండా పెషావర్లో సుమారు 1,800 చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్ని 300 సంవత్సరాలకు పూర్వం నాటివి.