Homeజిల్లా వార్తలుపాలమూరు పొలిటికల్ హీట్

పాలమూరు పొలిటికల్ హీట్

– మున్సిపల్​ చైర్మన్ల అవిశ్వాసాలు కోరుతూ నోటీసులు
– నలుగురు చైర్మన్లను దింపేందుకు సన్నాహాలు

ఇదేనిజం, మహబూబ్​ నగర్​: అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన నెల రోజులకే పాలమూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు కోరుతూ నోటీసులివ్వడంతో రాజకీయాలు రంజుగా మారాయి. సొంత పార్టీ కౌన్సిలర్లే ఛైర్మన్లపై తిరగబడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నలుగురు మున్సిపల్ ఛైర్మన్లను గద్దె దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇంత కాలం అణిగి ఉండాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్న వారు కొందరైతే.. తమ హక్కులు కాల రాశారని వాపోతున్న వారు మరికొంత మంది కౌన్సిలర్లు ఉన్నారు. తమ వార్డుల్లో కనీసం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక పోయామని, ప్రజలతో మాటలు పడుతున్నామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాము తిరస్కరణకు గురవుతామని ఆవేదన చెందుతున్నారు. ఇంత కాలం ఒంటెద్దు పోకడలతో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆ పార్టీ కౌన్సిలర్లే చెబుతున్నారు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, రానున్న ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను సంతృప్తిపర్చడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారట. అందుకే నాయకత్వాన్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మాణానికి నోటీసులిచ్చారు.

మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కల్వకుర్తి మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానం కోరుతూ కౌన్సిలర్లు అధికారులకు నోటీసులిచ్చారు. అవిశ్వాస తీర్మాణానికి రంగం సిద్దం చేస్తూ రహస్య మంతనాలు జరుపుతున్నారు. దీన్ని అవకాశంగా భావిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. శ్రీనివాస్ గౌడ్ పై ఉన్న అసంతృప్తిని కౌన్సిలర్లంతా అవిశ్వాస తీర్మానం రూపంలో బయటపెడుతున్నారు.

మహబూబ్ నగర్లో మొత్తం 49 మంది కౌన్సిలర్లున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 39వార్డులు గెలుచుకున్న బీఆర్ఎస్, ఛైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా నర్సింహులును ఎన్నుకున్నారు. ఇంత కాలం, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అసంతృప్తితో ఉన్నప్పటికీ కౌన్సిలర్లంతా అవకాశం కోసం ఎదురు చూశారు. నాలుగు సంవత్సరాల పదవీకాలం పూర్తవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టె అవకాశం దొరికింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా దొరికింది. అందుకే కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీకి చెందిన 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. అంటే కొంతమంది కౌన్సిలర్లు మినహా మిగతా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న జడ్జర్ల మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ దోరపల్లి లక్ష్మీని గద్దే దింపేందుకు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఛైర్ పర్సన్ భర్త రవీందర్ ను బీఆర్ఎస్ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఆయన వ్యవహార శైలిపై పలు మార్లు బహిరంగంగానే విమర్శించారు. ఛైర్ పర్సన్ ను మార్చకుంటే తాము కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతామంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారట. దీన్ని ఆసరాగా చేసుకుంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. పరిస్థితిని గమనించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నేతలు, కౌన్సిలర్లతో తన ఇంట్లో మంతనాలు జరిపారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో రాజీనామ చేయించి.. అవిశ్వాస తీర్మానానికి ఆస్కారం లేకుండా చేయాలని ఎత్తుగడ వేస్తున్నారు. కానీ మరో సంవత్సరం పాటు పదవీ కాలం ఉండడంతో రాజీనామ చేసేందుకు కౌన్సిలర్లు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో జడ్చర్ల మున్సిపల్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

కల్వకుర్తి లోనూ కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపు తర్వాత మున్సిపల్ పీఠంపై కాంగ్రెస కన్నేసింది. మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యంను మార్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మొత్తం 22 మంది కౌన్సిలర్లలో తొమ్మిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎడ్మ సత్యంపై ఉన్న అసంతృప్తితో పాటు మాజీ ఎంఎల్ఎ జైపాల్ యాదవ్ పై ఉన్న వ్యతిరేకతతో కల్వకుర్తి లోనూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లున్నారు. ఇందులో తొమ్మిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లున్నారు. 17 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లున్నారు. ఇందులో ఏడుగు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది.

కోస్గీ మున్సిపల్ ఛైర్ పర్సన్ మేకల శీరీషపై ఇప్పటికే అవిశ్వాస తీర్మానం కోరుతు నారాయణపేట కలెక్టర్ కు 11 మంది కౌన్సిలర్లు నోటీసులిచ్చారు. మొత్తం 25 కౌన్సిలర్లలో 16 మంది బీఆర్ఎస్, ఏడుగురు కాంగ్రెస్, ఇద్దరు స్వతంత్రులున్నారు. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్డడంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కౌన్సిలర్లు కూడా అదే బాట పట్టారు. దీంతో కోస్గీ మున్సిపాలిటీలోనూ పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మిగతా మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img