ఇదే నిజం దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ తాలుకా, గుండ్లపల్లి (డిండి) మండలం టీ గౌరారం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పంబాల వేణుగోపాల్ ను హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ) గా నియమిస్తూ, ఇటివల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన పంబాల కాశమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించిన పంబాల వేణుగోపాల్ దేవరకొండ పట్టణంలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజి, ఏంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు. ఎల్ ఎల్ బీ ,ఎల్ఎల్ఎం న్యాయవాద విద్యను ఉస్మానియా యూనివర్సిటీ లో చదివారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ బార్ కౌన్సిల్ లో తన పేరు నమోదు చేసుకుని న్యాయవాదిగా నాంపల్లి కోర్టులో పని చేశారు. ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం కోసం తెలంగాణ హైకోర్టు లలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏజీపీ పంబాల వేణుగోపాల్ మాట్లాడుతూ.తనకు అప్పగించిన విధులను ఎలాంటి పక్షపాతం, తారతమ్యం లేకుండా నిర్వర్తిస్తామన్నారు. తనపై నమ్మకంతో ఈ భాధ్యతను అప్పగించిన న్యాయ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ) గా పంబాల వేణుగోపాల్ నియామకంపై నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సీనియర్ న్యాయవాదులు మరియి జూనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తు, అభినందనలు తెలిపారు.