Park:తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద వార్ మెమోరియల్ పార్క్ ను ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ కు సమర్పిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు . రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దక్షిణ కొరియా లోని పర్యాటక ప్రదేశాలను అధ్యయనం చేయడానికి వెళ్లారు . సోమవారం రాజధాని సీయోల్ నగరం లో పర్యటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్యటనలో భాగంగా సియోల్ నగరంలో గత కొరియన్ వార్ లో ఉపయోగించిన తర్వాత నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, సబ్ మెరైన్లు, త్రివిధ దళాలకు చెందిన ఆయుధాలతో లతో ఏర్పాటు చేసిన పార్కు ను పరిశీలించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, అధికారులతో సంప్రదించి భారత దేశ త్రివిధ దళాలు గత యుద్ధాలలో ఉపయోగించి నిరుపయోగంగా ఉన్న యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, మెరైన్ లతోపాటు యుద్ధం లో వాడిన ఆయుధాలను వారి అనుమతితో తెలంగాణ రాష్ట్రంలో కొరియా తరహాలో ఏర్పాటు చేస్తే వార్ మెమోరియల్ పార్క్ ద్వారా నేటి యువత లో యుద్ధం పట్ల అవగాహన, ఆసక్తి, ధైర్యం, నాలెడ్జ్ పరంగా, దేశం పై అభిమానం, దేశభక్తి పెరిగేందుకు దోహదం చేస్తుందన్నారు.