Pawan Kalyan Fire on AP Government : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు.
రహదారుల అభివృద్ధి సంస్థ పరిధిలో 14 వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా, వాటిలో దాదాపు ఆరు వేల కిలో మీటర్ల వరకు ప్రస్తుతం దెబ్బతిన్నాయని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు, రోడ్ డాక్టర్ కాట్నం బాలగంగాధర్ తిలక్, లోక్‌సత్తా నగరాధ్యక్షుడు బి.అశోక్‌కుమార్ తెలిపారని ‘ఈనాడు’లో వచ్చిన ఓ వార్తను పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆరు వేల కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల్లో సగటున కిలో మీటరుకు ఒకటి నుంచి ఆరు గుంతలు ఉన్నాయని వారు అన్నారు.
2019 నుంచి ఇప్పటివరకు రహదారుల అభివృద్ధి సంస్థ పేరుతో ప్రభుత్వాలు రూ.5వేల కోట్లను వసూలు చేశాయని, అయితే, ఆ నిధులన్నింటినీ రహదారుల అభివృద్ధి కోసం కేటాయించకుండా ఇతర అవసరాల కోసం మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
ఈ అంశాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
‘అమ్మా పెట్టదు , అడుక్కు తిననివ్వదు.. రోడ్లపై గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ పరిస్థితి ఏపీలోనే ఉంది అని రోడ్ డాక్టర్ కాట్నం బాలగంగాధర్ తిలక్ అన్నారు. రూ.5 వేల కోట్ల రహదారి నిధులను మళ్లించారు’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.