– అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతం
– జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఇదే నా ఇజం.. హ్యూమనిజం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచినట్లు గుర్తు చేశారు.గురువారం కొత్తగూడెం జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని చెప్పారు. బీజేపీ పోటీ చేస్తున్నస్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, దాని కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు కష్టపడ్డాయని అన్నారు.‘తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు ఇచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నా. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న యువతకు జనసేన అండగా నిలబడుతుంది’అని పవన్ కల్యాణ్ అన్నారు.