పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విధించిన ఆంక్షలు.. పేటీఎం మొబైల్ పేమెంట్ యాప్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దేశంలోని కిరాణా స్టోర్లలో దాదాపు సగం పేటీఎంకు దూరమయ్యాయి. 42 శాతం కిరాణా వ్యాపారులు పేటీఎంకు బదులుగా ఇతర మొబైల్ పేమెంట్ యాప్స్‌ను వినియోగిస్తున్నట్టు కిరాణా క్లబ్ చేసిన ఓ తాజా సర్వేలో తేలింది. అంతేగాక 68 శాతం కిరాణా వ్యాపారుల్లో పేటీఎంపై నమ్మకం సన్నగిల్లినట్టు కూడా సదరు సర్వే చెప్పింది. ‘ఆర్బీఐ ఆంక్షలు తమ లావాదేవీలను ఆటంకపర్చవచ్చని కిరాణా వ్యాపారులు భయపడుతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఇతర మొబైల్ పేమెంట్ యాప్స్‌ను వాడుతున్నారు’ అని కిరాణా క్లబ్ వ్యవస్థాపక సీఈవో అన్షుల్ గుప్తా అన్నారు. పేటీఎంకు ప్రత్యామ్నాయ పేమెంట్ ఆప్షన్స్ కూడా బాగానే ప్రాచుర్యంలో ఉండటం.. కిరాణా స్టోర్లకు ఇప్పుడు దిగులు లేకుండా పోయిందని చెప్పారు.
కాగా, తమ దుకాణాల్లోకి వచ్చే కస్టమర్లను పేటీఎం మినహా మరే ఇతర పేమెంట్ మొబైల్ యాప్‌నైనా వాడండి అంటూ కిరాణా వ్యాపారులు సలహా ఇస్తున్నట్టు కూడా ఇంకొందరు చెప్తుండటం గమనార్హం. ఈ సర్వేలో మొత్తం 5వేల మంది కిరాణా వ్యాపారుల అభిప్రాయాలను కిరాణా క్లబ్ తీసుకున్నది. పేటీఎంకు బదులుగా చాలామంది ఫోన్‌పేను సూచిస్తున్నట్టు సర్వేలో స్పష్టమైంది. 50 శాతం రిటైలర్లు ఫోన్‌పే ద్వారా చెల్లింపులను చేయాలని తమ కస్టమర్లను కోరుతున్నారు. అలాగే 30 శాతం మంది వ్యాపారులు గూగుల్ పేను వినియోగిస్తుండగా, 10 శాతం మంది భారత్‌పేను వాడుతున్నారు. నిజానికి ఒకప్పుడు మొబైల్ పేమెంట్ యాప్స్‌లో పేటీఎం మాత్రమే టాప్‌లో ఉండేదన్న సంగతి విదితమే. ఆ తర్వాత ఫోన్‌పే, గూగుల్ పే నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆర్బీఐ ఆంక్షలు.. కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని ఖాతాలు, ప్రీ-పెయిడ్ సాధనాలు, ఈ-వ్యాలెట్లలో కస్టమర్లు డిపాజిట్లను చేయరాదని, బ్యాంక్ కూడా వాటిని అంగీకరించరాదని జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే వ్యాలెట్లలో ఉన్న నగదును అయిపోయేదాకా వాడుకోవచ్చు. ఇక ఇప్పటికే కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపైనా బ్యాంక్‌పై ఆంక్షలుండగా, తాజా పరిమితులతో దాదాపుగా సంస్థ సేవలు నిలిచిపోయినట్టే అవుతున్నది. నిబంధనల అమలులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్తున్నారు.