Homeతెలంగాణఓటేసేందుకు కదిలిన తెలంగాణ ప్రజాలు

ఓటేసేందుకు కదిలిన తెలంగాణ ప్రజాలు

– రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్​ షురూ..
– మధ్యాహ్నం 1 గంట వరకు 36.68 శాతం ఓటింగ్
– మెదక్​లో అత్యధికంగా 51 శాతం
– 20.79 శాతం పోలింగ్​తో లాస్ట్​లో హైదరాబాద్
– ఓటేసిన రాజకీయ నేతలు, ప్రముఖులు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో:

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు సుమారుగా 36.68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మెదక్​లో అత్యధికంగా 51 శాతం పోలింగ్‌ నమోదైంది. 20.79 శాతం పోలింగ్​తో హైదరాబాద్ లాస్ట్​లో నిలిచింది.వివిధ జిల్లాల వారీగా పోలింగ్ ఇలా ఉంది. భద్రాద్రిలో – 39%, హనుమకొండ- 35%, హైదరాబాద్‌ -29.79%, జగిత్యాల -46%, జనగామ -44%, భూపాలపల్లి- 49%, గద్వాల- 49%, కామారెడ్డి- 24.70%, కరీంనగర్‌- 20.09%, ఖమ్మం- 42%, కుమురంభీం- 42, మహబూబాబాద్‌- 46%, మహబూబ్‌నగర్‌- 45, మంచిర్యాల- 43%, మెదక్‌- 51%, మేడ్చల్‌ మల్కాజిగిరి- 26%, ములుగు- 46%, నాగర్‌కర్నూల్‌-40%, నల్గొండ- 39%, నారాయణపేట- 42%, నిర్మల్‌- 42%, నిజామాబాద్‌- 40%, పెద్దపల్లి- 44%, రాజన్న సిరిసిల్ల- 39%, రంగారెడ్డి-30%, సంగారెడ్డి-42%, సిద్దిపేట-44%, సూర్యాపేట-44 శాతం పోలింగ్‌ నమోదైంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.


ఓటేసిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు


సిద్దిపేట జిల్లా చింత మండకలో సీఎం కేసీఆర్ దంపతులు ఓటేశారు. అనంతరం అక్కడ ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ ఆయన వెళ్లిపోయారు.సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్​లో పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, కరీంనగర్​లోని జ్యోతినగర్​లో బీజేపీ ఎంపీ బండి సంజయ్​ ఓటు వేశారు. వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎమ్మెల్యే కాలనీలోని పోలింగ్ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాంనగర్​లోని పోలింగ్ బూత్​లో ఓటు వేశారు.


సినీ ప్రముఖులు ఇలా..


పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జూబ్లీహిల్స్​లోని క్లబ్​లో నటుడు చిరంజీవి దంపతులు ఓటు వేశారు. అక్కినేని నాగర్జున తన ఫ్యామిలీతో కలిసి పోలింగ్​ బూత్​లో ఓటేశారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ , సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్‌లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్‌ వచ్చారు. అల్లు అర్జున్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో సుమంత్‌ ఓటు వేశారు. మణికొండలో డిగ్రీ కాలేజీలో హీరో వెంకటేశ్​, గచ్చిబౌలిలోని ప్రభుత్వ స్కూల్​లో నాని ఓటేశారు. దర్శకుడు రాజమౌళి దంపతులు, హీరో సాయిధరమ్​, రవితేజ, నితిన్, ప్రియదర్శి, గోపీచంద్, సుధీర్​బాబు, నిర్మాత బండ్లగణేశ్​, దర్శకులు సుకుమార్, తేజ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Recent

- Advertisment -spot_img