Homeఫ్లాష్ ఫ్లాష్Piyush Ghoshal : విపక్ష నేతలను ఆటపట్టించారేమో?

Piyush Ghoshal : విపక్ష నేతలను ఆటపట్టించారేమో?

– ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సెటైరికల్ కామెంట్స్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: తమ యాపిల్‌ ఫోన్లలో హ్యాకింగ్‌ యత్నాలకు సంబంధించిన అలర్ట్‌లు వచ్చాయంటూ విపక్షనేతలు చేసిన ఆరోపణలు కలకలం సృష్టించాయి.ఈ ఆరోపణలను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తోసిపుచ్చారు. విపక్ష నేతలను ఎవరో సరదాగా ఆటపట్టించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ‘విపక్ష నేతలపై ఎవరో ఆటపట్టించి ఉండొచ్చని నేను అనుకుంటున్నా. దానిపై వారు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది’ అని మీడియా అడిగిన ప్రశ్నకు గోయల్‌ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్షాలపై ఆయన విమర్శలు చేశారు. ‘ప్రస్తుతం విపక్ష పార్టీలు బలహీనదశలో ఉన్నాయని భావిస్తున్నాను. అందుకే ఆ పార్టీల నేతలు ప్రతిదాంట్లో కుట్రకోణాన్ని చూస్తున్నారు. ఇది ఒక లోపం వల్ల జరిగి ఉండొచ్చని, 150 దేశాల్లోని ప్రజలకు ఈ సందేశం వచ్చిందని యాపిల్‌ సంస్థే స్వయంగా వెల్లడించింది.

దీనినిబట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా హ్యాకర్లు చురుగ్గా ఉన్నారని కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం’అని పీయూష్​ వెల్లడించారు. విపక్ష నేతలు ఏదనుకుంటే అది చెప్పొచ్చని, అయితే వారి పరిస్థితి ఏంటో దేశం మొత్తానికి తెలుసని గోయల్‌ విమర్శించారు. వారు ప్రస్తుతం అంతర్గత పోరులో చిక్కుకుపోయి ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు వారి బలహీనతలను సమీక్షించుకోవాలన్నారు. ప్రస్తుత వ్యవహారంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. తమ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అలర్ట్‌ సందేశాలు వచ్చినట్లు నిన్న విపక్ష ఎంపీలు మహువా మొయిత్రా, ప్రియాంక చతుర్వేది, రాఘవ్‌ చడ్డా, అసదుద్దీన్‌ ఓవైసీ, శశిథరూర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు ఈ అలర్ట్ వచ్చినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img