• త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్.. వివిధ ప్రయోగ దశల్లో మూడు వ్యాక్సిన్లు
• చైనా దిగుమతులను తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తులను పెంచుకోవాలి
• వోకల్ ఫర్ లోకల్ మంత్రంతో ముందుకు సాగుదాం
• వ్యవసాయం, ఆరోగ్య రంగం, టూరిజం రంగంలో స్వయం సమృద్ధి సాధన
• డిజిటల్ ఇండియాలో సైబర్ సెక్యూరిటీ పై ఫోకస్
• మహిళల అభివృద్ధి పథకాలకు కేంద్రం ప్రాధాన్యత
• జమ్మూకాశ్మీర్, లఢక్ అభివృద్ధికి ప్రణాళికలు
• వెనుకబడ్డ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
• ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 7.30కి ఎర్రకోటపై ఏడోసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. ఎంతో మంది త్యాగధనుల త్యాగాల ద్వారా స్వాతంత్ర్యంతో ఉన్నామన్న మోదీ… సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకుంటూ ముందుకు సాగుదామన్నారు. కరోనా సమయంలో ఆత్మ నిర్భర భారత్ నినాదం అందుకొని ముందుకు సాగడం అనివార్యం అన్న ప్రధాని తద్వారా భారత్‌లో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
దేశీయ ఉత్పత్తికి సాయం
చైనా వస్తువుల్ని పూర్తిగా తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తి రంగానికి అవసరమైన సహాయాన్ని అందిస్తమన్నరు. భారత్ అభివృద్ధి చెందితే విశ్వ కళ్యాణానికి అది మేలు చేస్తుందన్నారు. ముడి సరుకులు ఎగుమతి చేసి… విదేశాల నుంచి ఉత్పత్తులు, వస్తువులు దిగుమతి చేసుకోవడం ఎన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని… ఈ పరిస్థితి పూర్తిగా మారాలన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, టూరిజం రంగం ఇలా చాలా రంగాల్లో భారత్ దూసుకెళ్లడం అనివార్యమ న్నారు. భారత్‌లో తయారయ్యే వస్తువుల్ని విదేశాలకు భారీగా ఎగుమతి చెయ్యాలన్నారు. వోకల్ ఫర్ లోకల్ మంత్రంత ముందుకు సాగుదామన్నారు. వన్ నేషన్ వన్ రేషన్, బ్యాంకుల విలీనం, జన్ ధన్ లాంటివి దేశంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయని గుర్తుచేశారు.
వాజ్‌పేయ్ స్ఫూర్తితో..
వాజ్‌పేయ్ దార్శనికత ను గుర్తుచేస్తూ ఆయన హయాంలో స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం మొత్తం రోడ్లు ఏర్పడ్డాయ న్నారు. అదే స్ఫూర్తితో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడి కైన వెళ్లేందుకు రోడ్లు, రైల్వే, విమాన ప్రయాణాలన్నీ సమృద్ధిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గరీబ్ కళ్యాణ్ ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పించామన్న మోదీ.. వోకల్ ఫర్ లోకల్ ద్వారా పేదలకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీములను అమలు చేస్తున్నామన్నారు. దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చెందేందుకు అనేక రకాల పథకా లను తీసుకొచ్చామని, ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం, ఆధునిక భారత నిర్మాణానికి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.
భీమ్ UPI ద్వారా ఏడాదిలో రూ.3 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయని, ఇది దేశానికి గర్వ కారణం అన్నారు.
డిజిటల్ గ్రామాల దిశగా..
గత ఐదేళ్లలో లక్షన్నర పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ డెవలప్ చేశామన్నారు. గ్రామాలను డిజిటల్ ఇండియాగా మార్చుతున్నామన్నారు. రాబోయే వెయ్యి రోజుల్లో 6 లక్షల గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటవుతుందన్నారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందన్న మోదీ… వాయు, నౌకాదళంలో కూడా మహిళలకు అవకాశాలు ఇస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాఖ్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించామని జన్ ధన్ యోజన ద్వారా కరోనా కాలంలో ఆడపడుచులకు డబ్బులు ఇచ్చామని గుర్తుచేశారు. వేల జన ఔషధీ షాపుల్లో ఒక్క రూపాయికే శానిటైజర్ ప్యాడ్ అందిస్తున్నామన్నారు.
కరోనాకి ముందు దేశంలో ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్ ఉండేదన్న మోదీ ఇప్పుడు దేశంలో రోజూ 7 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయన్నారు.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్..
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న ప్రధా ని దాని ద్వారా ఆరోగ్య రంగంలో టెక్నాలజీని తీసుకురానున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు ప్రతీ ఒక్కరికీ ఒక్కో హెల్త్ ఐడీ కార్డ్ ఇస్తామన్నారు. దాన్లోనే ఆ వ్యక్తుల ఆరోగ్య వివరాలన్నీ ఉంటాయన్నారు. దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. అతి త్వరలో భారతీయులకు వ్యాక్సిన్ వస్తుందన్నారు. జమ్మూకాశ్మీర్, లఢక్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని గుర్తుచేశారు. అక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుగుసాగుతున్నామన్నారు. ఎన్నో రంగాలపై, ఎంతో మందిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందని, ఈ కరోనాపై పోరాటంలో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు.
మహాత్మునికి నివాళులు
అంతకు ముందు… బాపూ ఘాట్ దగ్గర మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 7.20కి ఎర్ర కోటకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనిక వందనం స్వీకరించారు. ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొన్నారు. ఈసారి విద్యార్థులు పాల్గొనలేదు. కొన్ని దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు, కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు… మొత్తంగా 4 వేల మంది మాత్రమే ఈసారి వేడుకల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా… ప్రధాని మోదీ కోరిన ఆత్మ నిర్భర భారత్ దిశగా దేశ ప్రజలు అడుగులు వెయ్యాలని ట్విట్టర్ లో కోరారు. ఎర్రకోట సమీపంలో నాలుగు కోవిడ్-4 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.