మహిళా సంరక్షణకు అధిక ప్రాధాన్యం..మహిళలను వేధించే వారి మీద కఠిన చర్యలు
యువత అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్ డిఎస్ చౌహాన్
రక్షణకి కాల్ సెంటర్ నంబర్ 8712662662
police:సైబర్ నేరాల బాధితులకు అండగా తెలంగాణ పోలీస్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె డ్డి అన్నారు. మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ దశాబ్ది వేడుకల నేపథ్యంలో రాచకొండ సీపీ చౌహన్ గారి ఆధ్వర్యంలో రాచకొండ సెక్యురిటి కౌన్సిల్ సహకారంతో సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో మహిళా సంరక్షణ, సైబర్ నేరాల పట్ల అవగాహనా కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.దేశం మొత్తంలో నంబర్ వన్ గా తెలంగాణ పోలీస్ నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతం అయింది అని, నేర శాతం కూడా తగ్గుముఖం పట్టింది అన్నారు. మహిళా భద్రత కోసం షి టీములు ఏర్పాటు చేయడం ద్వారా రోడ్ల మీద, మెట్రో రైళ్ళలో, బస్టాండు వంటి ప్రయాణ ప్రదేశాల్లో, ఆకతాయిల నుండి ఎదురయ్యే వేధింపుల నుండి మహిళలకు రక్షణ ఇస్తున్నామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి .
బహిరంగ లేదా ఆన్‌లైన్ ఈవ్ టీజింగ్/వేధింపులను అరికట్టేందుకు సైబర్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు మరియు షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. షీ టీమ్ బృందాలు, మహిళల భద్రత, ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన కల్పించేందుకు ఆడియో-వీడియో వ్యాన్ ఏర్పాటు చేసినట్లు డిజిపి శ్రీ అంజని కుమార్ పేర్కొన్నారు.సోషల్ మీడియాలో యువతులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టబోమని హెచ్చరించారు. యువతులు సామాజిక మాధ్యమాల్లో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులకు, మేసేజిలకు స్పందించకూడదని, ప్రొఫైల్ లాక్ ఖచ్చితంగా పెట్టుకోవాలని కమిషనర్ డిఎస్ చౌహాన్ సూచించారు.