ప్రముఖ సినీనటి పాయల్ రాజ్‌పుత్‌పై పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి షాపింగ్ మాల్ ప్రారంభించారంటూ పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో ఈ నెల 12న పిటిషన్ దాఖలైంది.
పరిశీలించిన జడ్జి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
వివరాలలోకి వెళితే… నటి పాయల్ రాజ్‌పుత్ గత నెల 11న పెద్దపల్లిలో షాపింగ్ మాల్ ప్రారంభించారు.
మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించలేదని, ఆమెతోపాటు షాపింగ్ మాల్ యాజమాన్యం కూడా మాస్కులు ధరించలేదని, భౌతిక దూరాన్ని గాలికి వదిలేశారని పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ తరపున ఆయన న్యాయవాది డొంకెన రవి పాయల్ రాజ్‌పుత్, షాపింగ్ మాల్ యజమాని వెంకటేశ్వర్లు, ఆయన భార్యపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 రోజుల క్రితమే వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
అయితే, తాజాగా కోర్టు ఆదేశాలతో విషయం వెలుగులోకి వచ్చింది.