– కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా కాళేశ్వరం
– తెలంగాణలోని ప్రతి కుటుంబంపై అప్పు
– రాష్ట్రంలో ఏర్పాటు కాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
– మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన
ఇదేనిజం, భూపాలపల్లి ప్రతినిధి: రాష్ట్రంలో బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొన్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పాటు కాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలో రాహుల్ పర్యటించారు. అంతకుముందు ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి ఆయన గురువారం మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లి కుంగిపోయిన ఆ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. ఆయనతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి ఠాక్రే , భట్టి విక్రమార్క ఉన్నారు. అంబట్ పల్లిలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలో రాహుల్ పర్యటించారు. ‘తెలంగాణలో రూ.లక్ష కోట్ల సంపద దోపిడీకి గురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారింది. రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతి కుటుంబంపై అప్పు భారాన్ని మోపారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చూస్తాం. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందించనున్నాం.’ కాంగ్రెస్ పార్టీది ప్రజల పాలన అని,, టిఆర్ఎస్ పార్టీది దొరల పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా పాలన జరుగుతుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో ప్రధాన పోటీ ఉంటుందని చెప్పారు. బీజేపీ ఎంఐఎం బిఆర్ఎస్ అన్ని పార్టీలు ఒకవైపున ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్క పౌరుడికి రూ 31,000 కి పైగా భారం పడిందన్నారు. రాహుల్ గాంధీ వెంట సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు పెద్దపల్లి, రామగుండం గండ్ర సత్యనారాయణ రావు, విజయ రమణారావు, మక్కాన్ సింగ్ , సిరిసిల్ల రాజయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు గుడాల అరుణ, బన్సోడా రాణి బాయ్, పంతకాని సమ్మయ్య, కోట రాజబాబు అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.