ఇదే నిజం, జగిత్యాల టౌన్: పార్లమెంట్ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో జరగనున్న వేళ లో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. 10 సంవత్సరాలు ఓవర్ లోడుతో ప్రయాణించిన కారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అదువు తప్పి బోల్తాపడడంతో కారులోని నాయకుల చూపు ప్రధానంగా అధికార కాంగ్రెస్ పైన పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుస్తుందనె నమ్మకం లేకపోవడంతో పార్టీ మారుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలు గ్రామ శాఖ అధ్యక్షులతో సహా 1000 మందికి పైగా చోటామోటా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం పెద్ద దుమారమే రేపింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు బిఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పైన నిత్యం దుమ్ము ఎత్తిపోసిన నాయకులు సైతం నేడు పోటాపోటీగా అదే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కొంత మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి దారులు మూసుకుపోవడంతో బిజెపి వారితో సహవాసం చేస్తూ కొత్తగా గులాబీ కమలంగా వికసిస్తున్నారు. టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేమే నిజమైన తెలంగాణ వాదులం అని చెప్పుకున్న నాయకులు నేడు బిజెపిలోకి వెళ్లి మేమే నిజమైన హిందువులం అనే విధంగా ప్రవర్తించడం చర్చనీయం అవుతుంది. పచ్చని చెట్టు పైన పక్షులు వాలినట్టు అధికారం ఎక్కడ ఉంటే నాయకులు అక్కడే ఉండడం పరిపాటిగా మారిపోయింది. దీంతో రాజకీయాలంటే ఇంతేనా రాజకీయ నాయకులకు విలువలు ఉండవా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడమే రాజకీయమా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.
అధికారం చేజారి పోయి కనీసం ఆరు నెలలు కూడా కాకముందే రాజకీయంగా తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీ లోకి, మరి కొంత మంది బిజెపిలోకి వెళ్తూ బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. బిఆర్ఎస్ పార్టీకి సంస్థగతంగా బలమైన క్యాడర్ లేక ఎప్పుడు పక్క పార్టీ నాయకులను చేర్చుకోవడం పైన ఎక్కువ దృష్టి పెట్టడం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను నాయనో బయానో బెదిరించి ప్రతిపక్షాలు లేకుండా చేయాలని పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించిన బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అదే శాపంగా మారింది.
గత పది సంవత్సరాల నుండి జెండా మోసిన కార్యకర్తలు పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల పైన, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకై రంగం సిద్ధం చేసుకోగా కొత్త నాయకులు పార్టీలో చేరడంతో తమ అవకాశాలకు గండిపడుతుందేమోనని మదన పడుతున్నారు. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి తీరా అధికారం పోగానే రంగులు మార్చుతున్న రాజకీయ నాయకులతో ఏ పార్టీ అయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారం కోసం జెండా మోసిన కార్యకర్తలను గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వాలి అంతేగాని జంపు జిలానిలకు పెద్దపీట వేస్తే రేపొద్దున మళ్లీ అధికారం పోగానే వీళ్ళు మరో పార్టీలోకి వెళ్తారనేది జగమెరిగిన సత్యం.