Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో నేడే పోలింగ్.. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయండి

తెలుగు రాష్ట్రాల్లో నేడే పోలింగ్.. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయండి

ఇదేనిజం, ప్రధాన ప్రతినిధి/తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లో ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలు, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే పోలింగ్‌ పూర్తి కానుంది. అయితే సమయం ముగిసినా.. క్యూలో నిల్చున్న వాళ్లకు ఓటేసేందుకు అనుమతి ఇస్తారు. తెలంగాణలోని 17 లోక్​సభ స్థానాలకు గాను 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏపీలోని 175 స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది పోటీ చేస్తున్నారు. సోమవారం ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పోలింగ్‌ సిబ్బంది ఇప్పటికే ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోగా.. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు తరలివెళ్లారు. తెలంగాణలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లలో సగానికి పైగా మహిళలే ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 3,30,00,088గా ఉండగా.. ఇందులో పురుషులు 1,64,10,227 మంది, మహిళా ఓటర్లు 1,65,87,134గా ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ల ఓట్ల సంఖ్య 2,727గా ఉంది. ఇక ఎన్నికల బరిలో ఉన్న 525 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళా అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,809 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 9,900 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. తెలంగాణలో 17 లోక్​సభ స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రముఖల్లో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి (సికింద్రాబాద్‌), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (కరీంనగర్‌), మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ (మల్కాజిగిరి), కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్‌ (సికింద్రాబాద్‌), ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ (హైదరాబాద్‌), బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (చేవెళ్ల), మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ (నాగర్‌కర్నూల్‌), నామా నాగేశ్వరరావు (ఖమ్మం) ఉన్నారు. ఏపీలో అసెంబ్లీ బరిలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ (పులివెందుల), టీడీపీ అధినేత చంద్రబాబు (కుప్పం), జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ (పిఠాపురం), నారా లోకేశ్‌ (మంగళగిరి), బాలకృష్ణ (హిందూపురం), జైభారత్‌ పార్టీ చీఫ్‌ వీవీ లక్ష్మీనారాయణ (విశాఖ నార్త్‌), లోక్‌సభ బరిలో ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (కడప), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (రాజమండ్రి), ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి (రాజంపేట), ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (విశాఖ) బరిలో ఉన్నారు. 

దేశవ్యాప్తంగా నాలుగో ఫేజ్​కు సర్వం సిద్ధం..
నాలుగో విడతలో భాగంగా ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. 96 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 4,264 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, బిహార్‌లో 5, జార్ఖండ్, ఒడిశాలలో చెరో 4, జమ్మూ కశ్మీర్‌లోని ఒక స్థానానికి ఎన్నిక జరగనుంది. నాలుగో విడత ఎన్నికల్లో ఒక్కో లోక్‌సభ స్థానం నుంచి సగటు సంఖ్య 18 మంది పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 45 మంది, అత్యల్పంగా ఒడిశాలోని నవరంగ్‌పుర్‌లో నలుగురు బరిలో ఉన్నట్లు వివరించింది.

కీలక అభ్యర్థులు వీరే..
నాలుగో విడతలో ప్రముఖ రాజకీయ నాయకులు ఎన్నికల బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్​ యాదవ్ (కనౌజ్), నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా (శ్రీనగర్), గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్), అధిర్ రంజన్ చౌదరి (బహరంపూర్), మహువా మొయిత్రా (కృష్ణానగర్), శతృఘ్న సిన్హా (అసన్సోల్) పోటీ పడుతున్నారు.

కట్టుదిట్టమైన నిఘా.. ప్రత్యేక సౌకర్యాలు
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతుండగా..  మొత్తంగా 17.7 కోట్ల మంది ఓటర్లు  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 1.92లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 19లక్షల మందికి పైగా పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో 1,016 అంతర్‌ రాష్ట్ర, 121 అంతర్జాతీయ సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.  అక్రమ మద్యం, డ్రగ్స్, డబ్బు, ఇతర తాయిలాల పంపిణీ వంటివి అడ్డుకొనేందుకు సముద్ర, వాయు మార్గాల్లోనూ నిఘా ఉంచారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు వీల్‌ఛైర్లను సైతం అందుబాటులో ఉంచారు. దేశంలో ఇప్పటివరకు మూడు దశల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి.  283 స్థానాలకు పోలింగ్‌ పూర్తి కాగా.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Recent

- Advertisment -spot_img