– తమిళనాడులో దారుణం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కరెంట్ కోతతో ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న మహిళ చనిపోయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువరూర్ జిల్లాలో జరిగింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ తిరువరూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మహిళ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మరణించింది. మృతురాలిని 48 ఏండ్ల అమరావతిగా గుర్తించారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో పవర్ బ్యాకప్ లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితురాలి కుటుంబసభ్యులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన తమిళనాడు సర్కారు.. మహిళ మరణానికి దారితీసిన పరిస్ధితులపై దర్యాప్తునకు ఓ బృందాన్ని నియమించింది. ఎమర్జెన్సీ విభాగంలో విద్యుత్ లేకపోవడం ఏంటని డాక్టర్లను ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టార్చ్‌లైట్ వెలుగులో డాక్టర్ ఓ రోగికి ఇంజక్షన్ చేస్తుండటం కనిపించింది. మహిళ ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతూ మరణించిందని.. కరెంట్ కేవలం అయిదు నిమిషాల పాటే నిలిచిపోయిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ పేర్కొన్నారు. వెంటిలేటర్స్‌కు గంట వరకూ బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని మంత్రి తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న మరో నలుగురు ఇతర రోగులకు ఎలాంటి సమస్య తలెత్తలేదని ఆయన గుర్తుచేశారు.