Prabhas : తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి, తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుందని, కిడ్నీ మార్పిడి కోసం దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చవుతాయని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దాతల సాయం కోసం ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ టీం నుంచి ఒక వ్యక్తి స్రవంతిని సంప్రదించి, కిడ్నీ దాతను ఏర్పాటు చేసుకోమని, ఆపరేషన్ ఖర్చు మొత్తం ప్రభాస్ భరిస్తారని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా స్రవంతి విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో కొన్ని విషయాలను వెల్లడించింది. ప్రభాస్ అసిస్టెంట్‌గా చెప్పుకున్న ఓ వ్యక్తి తమను సంప్రదించి, సాయం చేస్తామని చెప్పినట్లు స్రవంతి తెలిపారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సాయం అందలేదని, ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు ఎవరూ రిస్పాండ్ చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాల్ ఫేక్ అని తేలడంతో ఇలాంటి కాలయాపన చేసే కాల్స్‌తో కాకుండా, నిజంగా సాయం చేయగలిగిన వారు ముందుకొచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని స్రవంతి వేడుకున్నారు. ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో ఆయన కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది.