Homeజాతీయంమాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు

న్యూఢిల్లీ: ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ఆయన కోలుకునేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించారని, దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రార్థనలు చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీటర్​లో పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆగస్ట్ 10న ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు మెదడుకు సంబంధించిన అత్యవసర శస్త్రచికిత్స చేశారు. అనంతరం ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. గత కొద్దిరోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు. ప్రణబ్​ మృతికి నివాళిగా దేశ వ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది
ఇందిరకు నమ్మినబంటు
1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌ బిర్భుమ్ జిల్లాలోని మిరాఠీలో ప్రణబ్‌ ముఖర్జీ జన్మించారు. ఆయన తండ్రి కె.కె.ముఖర్జీ స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్‌ శాసన మండలిలో కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 1969లో రాజకీయ ప్రవేశం చేసిన ప్రణబ్‌ ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయుడుగా పేరుగడించారు. ఇందిరాగాంధీ, పీవీ, మన్మోహన్‌ ప్రభుత్వాల్లో ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖల మంత్రిగా సేవలు అందించారు. 2012 జులై 25 నుంచి ఐదేళ్ళపాటు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు తపాలాశాఖలో యూడీసీగా కొన్నాళ్లు పనిచేశారు.
కుంటుంబం..
గ్రాడ్యుయేషన్‌ తర్వాత ప్రణబ్‌ పొలిటికల్‌ సైన్స్‌, చరిత్రలో మాస్టర్స్‌ పట్టాలను పొందారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాను సాధించారు. సువ్రా ముఖర్జీని వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ 2015 ఆగస్టులో కన్నుమూశారు.
ఎంత రచ్చ చేసినా.. వెనక్కు తగ్గలేదు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పక్కా కాంగ్రెస్ నేత అయినా రాష్ట్రపతిగా బాధ్యతలు ముగిశాక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో కలిసి వేదికను పంచుకోవడం అప్పట్లో దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత రచ్చ చేసినా ప్రణబ్ వెనక్కు తగ్గకపోవడం విశేషం.
అత్మీయులకు ‘ప్రణబ్‌ దా’
ఆత్మీయులు ‘ప్రణబ్‌ దా’గా ముద్దుగా పిలుచుకుంటారు. సమకాలీన రాజకీయాల్లో ప్రణబ్​ ఒకరు. తర 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి శేభాష్​ అనిపించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి వివాదాలు తలెత్తినా ప్రణబ్​కు అప్పగిస్తే సమసిపోవాల్సిందే. పార్టీలో వివాద పరిష్కర్తగా పేరు సంపాదించారు.
సొంత పార్టీ పెట్టారు
ఇందిర మరణం అనంతరం కాంగ్రెస్​ పార్టీ బాధ్యతను రాజీవ్‌ గాంధీ చేపట్టడంతో ప్రణబ్​ సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్‌ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. అనంతర పరిణామాల కారణంగా 1989లోకాంగ్రెస్‌లో విలీనం చేశారు.
సోనియాకు మార్గనిర్దేశం
1998లో కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు సోనియా గాంధీ చేపట్టేలా ఆమెను ఒప్పించడంలో ప్రణబ్‌దే కీలక పాత్ర. 2004లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన తొలిసారిగా లోక్‌సభ నుంచి గెలుపొందారు. 2012 వరకూ ఆయన కీలకమైన విదేశీ, రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించారు.
అవార్డులు
2019లో భారతరత్నతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్నారు.

ఇయర్​వైజ్​గా ముఖ్య సంఘటనలు
1969లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నిక
1975, 81, 93, 1999లోనూ రాజ్యసభకు ఎన్నిక
1980-85 వరకు రాజ్యసభలో అధికారపక్ష నేత
1973-74 కాలంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ ఉపమంత్రిగా
1974లో కొన్నినెలలు రవాణా, నౌకాయాన ఉపమంత్రిగా…
1974-75లో ఆర్థికశాఖ ఉపమంత్రిగా..
1975-77లో రెవిన్యూ, బ్యాంకింగ్ సహాయమంత్రిగా..
1980-82లో వాణిజ్యం, గనుల కేబినెట్ మంత్రిగా..
1982-84లో ఆర్థికమంత్రిగా..
1991-96లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా..
1993-95లో వాణిజ్యశాఖ మంత్రిగా..
1995-96లో విదేశాంగమంత్రిగా.. విధులు నిర్వర్తించారు
జంగీపూర్ నుంచి 2004లో లోక్‌సభకు ఎన్నిక
2004-06లో రక్షణశాఖ మంత్రిగా..
2006-09లో విదేశాంగమంత్రిగా..
2009-2012లో ఆర్థికమంత్రిగా పనిచేశారు
2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img