Homeజాతీయంప్రశాంత్​ భూషణ్​కు రూపాయి జరిమానా విధించిన సుప్రీం కోర్టు

ప్రశాంత్​ భూషణ్​కు రూపాయి జరిమానా విధించిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జీలను కించపరిచే విధంగా ట్విట్లు చేసిన కేసులో దోషిగా తేలిన సీనియర్​ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీం కోర్టు రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15వ తేదీలోగా జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష, లేదంటే మూడేళ్లపాటు ప్రాక్టీస్‌పై నిషేధం తప్పదని హెచ్చరించింది.
సహచర న్యాయవాది నుంచి రూపాయి
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రశాంత్ భూషణ్ ట్విటర్​లో ఓ ఫొటోను షేర్​ చేశారు. కోర్టు ధిక్కార కేసులో సుప్రీం కోర్టు తీర్పును కృతజ్ఞతాపూర్వగా అంగీకరించినట్టు పేర్కొన్నారు. జరిమానా కట్టేందుకు అవసరమైన రూపాయిని తన లాయర్, సీనియర్ సహోద్యోగి రాజీవ్ తనకు ఇచ్చారని చెప్పారు. అందులో ప్రశాంత్ భూషణ్‌కు ఆయన లాయర్ రాజీవ్ ధవన్ రూపాయి కాయిన్​ ఇస్తున్నట్టు ఉంది.
వివాదస్పదమైన ట్విట్లు
సుప్రీం కోర్టు సీనియర్​ న్యామవాది ప్రశాంత్​ భూషణ్​ జూన్​ 27, 29న చేసిన రెండు ట్విట్లు వివాదస్పదం అయ్యాయి. సుప్రీం కోర్టు చీఫ్​ జస్టిస్​లుగా పనిచేసిన నలుగురి పనితీరును తప్పుపడుతూ తొలి ట్విట్​ చేశారు. రెండు రోజుల తర్వాత ప్రస్తుత సీజే జస్టిస్​ బోబ్డే లాక్​డౌన్​ నిబంధనలు కాదని ఓ రాజకీయ పార్టీ నాయకుడి హార్లీ డెవిడ్​సన్​ బైకు నడిపారని, ప్రజలకు న్యాయం దూరం చేసేందుకు కోర్టును లాక్​డౌన్​లో ఉంచారని ఆరోపిస్తూ బోబ్డే నడిపిన బైక్​ ఫోటోను ట్విట్​ చేశారు. ప్రశాంత్​ ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు ప్రతిష్ఠను దిగజార్చేలా ట్విట్లు చేశారని వాటిని సుమోటోగా కోర్టు స్వీకరించి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కార స్వభావంతో ఉన్నట్లు ఆగస్టు 14న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆగస్టు 20నే శిక్ష ఖరారు చేయాల్సింది కానీ ఈ ట్వీట్లపై పునరాలోచించుకుని, కోర్టుకు క్షమాపణ చెప్పేందుకు ఆయనకు 3 రోజుల గడువు ఇచ్చింది. అయితే ఇవి తాను నిజాయితీతో వ్యక్తం చేసినవని, తాను క్షమాపణ చెప్పబోనని కోర్టు విధించే ఏ శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట
దేశ వ్యాప్తంగా చర్చలో వ్యక్తిగా ప్రశాంత్​ భూషణ్​ నిలిచారు. 63 ఏండ్ల ప్రశాంత్​ ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన శాంతి భూషణ్​ కుమారుడు. ఐఐటీలో మెకానికల్​ ఇంజినీరింగ్​ కోర్సును మధ్యలోనే వదిలేసి అలహాబాద్​ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పబ్లిక్​ ఇంట్రెస్ట్​ లిటిగేషన్ల నిపుణుడిగా పేరు సంపాదించారు. ప్రజాప్రయోజనాలతో ముడిపడిన అనేక కేసులను ప్రశాంత్​ వాదించారు. నర్మదా బచావ్​, భోపాల్​ గ్యాస్​ దుర్ఘటన, 1984 అల్లర్లు, బోఫోర్స్, ఎన్రాన్​, పన్నాముక్తా చమురు క్షేత్రాల కేసు, నీరా రాడీయా ఆడియో టేపుల కేసు, సీవీసీగా పీజే థామస్ నియామకం, మారిషస్​ డబుల్​ ట్యాక్సేషన్​ కేసు, దళిత క్రిస్టియన్లు, ముస్లింల రిజర్వేషన్లపై పిల్​ వీటితో అనేక ప్రజాప్రయోజన కేసులను వాదించారు. ఫండమెంటల్​ రైట్స్ పై ఆయన చేసిన అనేక ట్విట్లకు నెటిజన్ల నుంచి మద్దతు లభించింది. 2009లో తెహల్కా మ్యాగజైన్​కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో న్యాయవ్యవస్థలోని అవినీతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోని కోర్టు ధిక్కారణ అభియోగాలను సైతం నమోదు చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img