– నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేసిన నిందితుడు
ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శివరాం రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. నేను లొంగిపోతున్నా అంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు శివరాం రాథోడ్. అందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నాంపల్లి 9వ మెట్రోపాలిటన్ జడ్జి ఎదుట శివరాం లొంగిపోయాడు. ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రవళిక లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది. అక్టోబర్ 13న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు. కాగా, పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు, ప్రేమ వ్యవహారం కారణం అని తేల్చారు. బాయ్ ఫ్రెండ్ శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ ఘటనలో శివరాంపై కేసు నమోదు చేశారు.